మార్కెట్ యార్డు వద్ద టమోటా రైతుల ఆందోళన
ABN , Publish Date - Oct 19 , 2026 | 02:04 AM
గుర్రంకొండ టమోటా మార్కెట్ యార్డులో వ్యాపారుల అక్రమాలు నశించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డులో కొందరు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ధర్నా-రాస్తారోకో నిర్వహించారు.
వ్యాపారుల అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్
గుర్రంకొండ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): గుర్రంకొండ టమోటా మార్కెట్ యార్డులో వ్యాపారుల అక్రమాలు నశించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డులో కొందరు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ధర్నా-రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. మదనపల్లె, ములకలచెరువు, కలకడ, పుంగనూరు, అంగళ్లు ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ధరకు వేలం పాడుతున్నారని, తద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ధరలు నచ్చకుంటే ఇతర మార్కెట్లకు వెళ్లాలని బెదిరిస్తున్నారన్నారు. కాగా, ధర్నా మూడు గంటలకు పైగా జరగడంతో కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, మార్కెట్ కార్యదర్శి మదన్మోహన్రెడ్డి రైతులతో మాట్లాడారు. ధరలు పెంచి వేలం పాట నిర్వహించేలా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారులు ప్రవర్తించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మదనపల్లె, అంగళ్లు, ములకలచెరువు, కలకడ మార్కెట్లో టమోటా రేట్లను ప్రతి రోజు డిస్ప్లే చేయిస్తామని చెప్పడంతో వారు శాంతించారు.