Share News

15 కేజీల క్రేట్ల అమలుపై టమోటా రైతుల నిరసన

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:48 AM

15 కేజీల బాక్సులు అమలు చేస్తే తీవ్రంగా నష్టపోతాం... కూలీల ఖర్చు ఎక్కువై వాహనాల్లో లోడింగ్‌ చేసి మార్కెట్‌కు తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది.. బాక్సుల్లో కాయలు నలిగిపోయి ఆశించిన ధర పలకవు.. మా కడుపు కొట్టొద్దు’ అంటూ టమోటా రైతులు మార్కెటింగ్‌ శాఖ అధికారిపై తిరగబడ్డారు.

15 కేజీల క్రేట్ల అమలుపై టమోటా రైతుల నిరసన
వేలం నిలిపివేయడంతో నిరసనకు దిగిన రైతులు

ములకలచెరువు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘15 కేజీల బాక్సులు అమలు చేస్తే తీవ్రంగా నష్టపోతాం... కూలీల ఖర్చు ఎక్కువై వాహనాల్లో లోడింగ్‌ చేసి మార్కెట్‌కు తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది.. బాక్సుల్లో కాయలు నలిగిపోయి ఆశించిన ధర పలకవు.. మా కడుపు కొట్టొద్దు’ అంటూ టమోటా రైతులు మార్కెటింగ్‌ శాఖ అధికారిపై తిరగబడ్డారు. స్థానిక మార్కెట్‌ యార్డులో ఆదివారం నుంచి 15 కేజీల బాక్సులతో వేలం పాటలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే రైతులు దానిపై ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో ఆదివారం 15 కేజీల బాక్సుల ద్వారానే వేలం నిర్వహించేందుకు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ బాలాజీ సిద్ధమయ్యారు. ఆగ్రహించిన రైతులు మార్కెట్‌ కమిటీ కార్యదర్శిపై తిరగబడ్డారు. వేలం పాటలు జరిగే చోటే బైఠాయించారు. కార్యదర్శి, సిబ్బంది అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులు మాట్లాడుతూ 25 కేజీలు కాకుండా 15 కేజీల బాక్సులతో వేలం నిర్వహిస్తే నష్టం వస్తుందన్నారు. 50 బాక్సుల్లో పట్టే కాయలు వంద బాక్సులు అవుతాయని, కూలీల ఖర్చు పెరుగుతుందని అన్నారు. బాక్సులు ఒకదాని మీద ఒకటి పెడితే కాయలు నలిగిపోయి ధర ఉండదన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో రైతులు రమణారెడ్డి, మునీర్‌, కరుణాకర్‌రెడ్డి, రమణప్ప నాయుడు, ప్రసాద్‌రెడ్డి, శీనానాయక్‌, రామచంద్ర, గిరి పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 12:48 AM