Share News

పార్టీని డ్యామేజ్‌ చేస్తే సహించం

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:25 AM

పార్టీలైన్‌ దాటి ఎవరు ప్రవర్తించినా, పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేలా ప్రవర్తించినా సహించేది లేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు

పార్టీని డ్యామేజ్‌ చేస్తే సహించం

సత్యవేడు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పార్టీలైన్‌ దాటి ఎవరు ప్రవర్తించినా, పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేలా ప్రవర్తించినా సహించేది లేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. శ్రీసిటీలో బుధవారం రాత్రి చంద్రబాబు బస చేసిన విషయం తెలిసిందే. సత్యవేడు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై రాత్రి పది గంటల సమయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఎవరికి వారు గ్రూపులు కట్టి పార్టీని దెబ్బతీయడం మంచిది కాదని ఆగ్రహించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిమూలం, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ కూరపాటి శంకర్‌రెడ్డి మధ్య నెలకొన్న విబేధాలపై నేతలతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. పూటకో నిర్ణయం తీసుకునే సంప్రదాయం టీడీపీలో లేదని, అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా నాయకులు కట్టుబడి ఉండాలని చెప్పినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను చూసుకునే బాధ్యత శంకర్‌రెడ్డిదేనని.. అదే సమయంలో ఎమ్మెల్యే ప్రొటోకాల్‌కు ఎవరూ భంగం కలిగించకుండా నడుచుకోవాలని మందలించినట్లు తెలిసింది. కార్యకర్తల బలంతోనే పార్టీ గెలుస్తోందని, అలాంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేయకుండా నాయకులు అందుబాటులో ఉండాలని హితవు పలికినట్లు తెలిసింది. త్వరలో పార్టీ కేంద్ర కార్యాలయానికి నాయకులను పిలిపించి, సమస్యలపై పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సత్యవేడు నియోజకవర్గం నుంచి మట్టిని తమిళనాడుకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కలెక్టర్‌, ఎస్పీని పిలిపించి ఇకపై మట్టి అక్రమ రవాణా జరిగితే చర్యలు ఉంటాయని వారికి సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

Updated Date - Jul 03 , 2026 | 12:25 AM