Share News

తిరుపతిలో నిర్మానుష్యంగా టోకెన్ల కేంద్రాలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:22 AM

తిరుపతిలో నిత్యం భక్తుల రద్దీతో కనిపించే టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీ కేంద్రాలు శుక్రవారం నిర్మానుష్యంగా కనిపించాయి

తిరుపతిలో నిర్మానుష్యంగా టోకెన్ల కేంద్రాలు

తిరుపతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో నిత్యం భక్తుల రద్దీతో కనిపించే టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీ కేంద్రాలు శుక్రవారం నిర్మానుష్యంగా కనిపించాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టోకెన్లు లేకుండా నేరుగా సర్వ దర్శనానికి భక్తులను అనుమతించడమే దీనికి కారణం. విష్ణు నివాసం, శ్రీనివాసం వసతి సముదాయాల వద్ద సర్వ దర్శనానికి టైమ్‌ స్లాటెడ్‌.. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్సు ఆవరణలో సర్వదర్శనంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శన టోకెన్ల జారీ కేంద్రాలున్నాయి. భక్తుల రద్దీని బట్టి ఈ మూడు చోట్లా రోజువారీ 14 వేల నుంచీ 20 వేల దాకా సర్వ దర్శన టైమ్‌ స్లాటెడ్‌ టోకెన్లు జారీ చేస్తారు. ఇక, భూదేవి కాంప్లెక్సులో శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు రోజుకు 2 వేల నుంచీ 3 వేల దాకా దివ్య దర్శన టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్ల కోసం నిత్యం వేలాది మంది భక్తులతో ఆయా ప్రాంగణాలు రద్దీతో ఉండేవి. ఈనెల 8వ తేది వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి టోకెన్లూ అవసరం లేదు. నేరుగా తిరుమలలో క్యూలైన్లలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది. దీంతో తిరుపతిలోని ఈ మూడు కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి.

అమ్మవారి సేవలో 38,596 మంది

జనవరి ఫస్ట్‌న రికార్డు స్థాయిలో దర్శనాలు

తిరుచానూరు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): జనవరి ఒకటో తేదీన రికార్డు స్థాయిలో 38,596 మంది భక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 10గంటల వరకు ఇంత మంది అమ్మవారి దర్శనానికి వచ్చారు. వారాంతపు రోజుల్లో సుమారు 25వేల మంది అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక ఉత్సవాలైతే మరో రెండు వేల మంది పెరగతారు. కానీ, ఆంగ్ల నూతన సంవత్సరాదికి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీఐపీలు ఎక్కువగా వచ్చినా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడంతో ఇంతమంది దర్శించుకోగలిగారని ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ తెలిపారు.

Updated Date - Jan 03 , 2026 | 12:22 AM