Share News

నేడే ఒక రోజు బ్రహ్మోత్సవం

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:05 AM

: ఒక రోజు బ్రహ్మోత్సవానికి తిరుమల సంసిద్ధమైంది. రథసప్తమి సందర్భంగా శ్రీవారి సప్తవాహన విహారానికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. సూర్యజయంతి ఆదివారం రావడంతో ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా. వారాంతపు సెలవులతోపాటూ సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో శనివారం ఉదయం నుంచే తిరుమల కొండంతా భక్తులు కనిపిస్తున్నారు. సాయంత్రానికే గ్యాలరీలన్నీ కిటకిటలాడుతున్నాయి. రాత్రి 7 గంటల సమయానికే మాడవీధులు సగానికిపైగా నిండిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల ద్వారదర్శనాలను లోటుపాట్లు లేకుండా నిర్వహించిన అనుభవంతో టీటీడీ గట్టి ఏర్పాట్లు చేసింది.

నేడే ఒక రోజు బ్రహ్మోత్సవం
- పుష్ప, విద్యుత్‌ అలంకరణలతో ముస్తాబైన తిరుమల

వాహనసేవలు

సూర్యప్రభ: ఉదయం 5.30-8.00గంటలు

(సూర్యోదయం 5.45కి)

చిన్నశేష వాహనం: 9-10

గరుడ వాహనం: 11-12

హనుమంత వాహనం: మధ్యాహ్నం 1-2

చక్రస్నానం: 2-3

కల్పవృక్ష వాహనం: 4-5

సర్వభూపాల వాహనం: రాత్రి 6-7

చంద్రప్రభ వాహనం: 8-9

తిరుమల, జనవరి24(ఆంధ్రజ్యోతి): ఒక రోజు బ్రహ్మోత్సవానికి తిరుమల సంసిద్ధమైంది. రథసప్తమి సందర్భంగా శ్రీవారి సప్తవాహన విహారానికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. సూర్యజయంతి ఆదివారం రావడంతో ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా. వారాంతపు సెలవులతోపాటూ సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో శనివారం ఉదయం నుంచే తిరుమల కొండంతా భక్తులు కనిపిస్తున్నారు. సాయంత్రానికే గ్యాలరీలన్నీ కిటకిటలాడుతున్నాయి. రాత్రి 7 గంటల సమయానికే మాడవీధులు సగానికిపైగా నిండిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల ద్వారదర్శనాలను లోటుపాట్లు లేకుండా నిర్వహించిన అనుభవంతో టీటీడీ గట్టి ఏర్పాట్లు చేసింది.

వణికిస్తున్న చలి

తిరుమలలో వాతావరణం శనివారం మారిపోయింది. మబ్బులు కమ్మి భానుడి జాడ లేకుండాపోయింది. చలి తీవ్రంగా ఆదివారంనాటి వాహనసేవలు వీక్షించేందుకు గ్యాలరీల్లోకి చేరుకున్న భక్తులు వణికిపోతున్నారు. రఽథసప్తమిలోని తొలివాహనం సూర్యప్రభపై శ్రీవారిని వీక్షించేందుకు దుప్పట్లు కప్పుకుని గ్యాలరీల్లోనే నిద్రిస్తూ కనిపించారు.

గ్యాలరీల్లోకి ఐదు దారులు

వాహనసేవలు జరిగే మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు ప్రవేశించేందుకు ప్రధానంగా ఐదు మార్గాలను సిద్ధం చేశారు. ఈ9, ఎన్‌4, ఎన్‌8, డెబ్యూ1, డెబ్యూ7 గేట్ల నుంచి భక్తులను అనుమతించి అన్ని గ్యాలరీల్లోకి సర్దుబాటు చేయనున్నారు. దర్శనం పూర్తిచేసుకుని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులను లడ్డూకౌంటర్‌ మీదుగా వెలుపలకు పంపేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

14 రకాల ఆహారపదార్ధాలు

ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు గ్యాలరీల్లోనే కూర్చుండిపోయే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశ్యంతో టీటీడీ సారి 14 రకాల ఆహారపదార్థాలను సిద్ధం చేస్తోంది. మూడు రకాల ఉప్మా, సాంబారన్నం, పులిహోర, పొంగలి, టమోటరైస్‌, చక్కర పొంగలి, సుండలు, బాదంపాలు, మజ్జిగ, కాఫీ, పాలు, బిస్కెట్‌ ప్యాకెట్లు వంటివి భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇందుకోసం మాడవీధుల్లో 52 ఫుడ్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచే అన్నప్రసాదాల పంపిణీని మొదలుపెట్టారు.

2,500 మందితో భద్రత

గ్యాలరీల్లోనూ, వెలుపలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతేడాది రథసప్తమికి 2వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తే ఈసారి 2,500 మంది పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బందిని నియమించారు. శనివారం ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లపై తనిఖీ చేశారు. ఆస్థానమండపంలో ప్రత్యేక సమీక్షి నిర్వహించి విధుల్లో వ్యవహరించాల్సిన తీరును వివరించారు. ఈసారి అత్యాధునిక ఏఐ ఆధారిత పాన్‌-టిల్ట్‌-జూమ్‌(పీజీజెడ్‌) సీసీ కెమెరాలను మాడవీధుల్లో అమర్చారు. ఈ కెమెరాలు దూరప్రాంతాల్లోని దృశ్యాలను పగలు, రాత్రి అనే తేడా లేకుండా రికార్డు చేస్తాయి. వీటి నుంచి వచ్చే ఫీడ్‌ను ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంట్రల్‌ నుంచి పరిశీలిస్తూ తగిన సూచనలు ఇస్తారు. 3,700 వేల మంది శ్రీవారిసేవకులు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాలరీల్లో ఉండే భక్తులకు సేవలు అందించనున్నారు.

పది టన్నుల పూలు

రథసప్తమి అలంకరణకు 10 టన్నుల పూలు వాడుతున్నారు. శ్రీవారి ఆలయంలో 4 టన్నులు, వెలుపల 6 టన్నులతో అలంకరణలు చేశారు. 40 వేల కట్‌ప్లవర్స్‌తో ఆలయంలో పలు చోట్ల అందంగా తీర్చిదిద్దారు. వాహనమండపాన్ని పూలూ, పండ్లతో అలంకరించారు. తిరుమల అంతా విద్యుత్‌ అలంకరణల శోభ ఆకట్టుకుంటోంది.

సూర్యప్రభకి 70 కిలోల నూరువరహాల మాల

రథసప్తమిలో తొలి, ప్రధాన వాహనమైన సూర్యప్రభ పై కొలువుదీరే శ్రీమలయప్పస్వామిని 70 కిలోల బరువు కలిగిన నూరువరహాల మాలతో అలంకరిస్తారు. రాత్రి చంద్రప్రభ వాహనసేవలో 60 కిలోల తెల్ల చామంతి పూలమాలను స్వామికి అలంకరిస్తారు. మొత్తం ఏడు వాహనసేవలకు వెయ్యి కిలోల పూలమాలలను వినియోగించనున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 02:05 AM