నేడు, ఎల్లుండి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:41 AM
చిత్తూరు జిల్లాలో గురు, శనివారాల్లో ఈనెల 9, 11 తేదీల్లో నిర్వహించనున్న డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఆర్వో కె.మోహన్ కుమార్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శనివారాల్లో ఈనెల 9, 11 తేదీల్లో నిర్వహించనున్న డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఆర్వో కె.మోహన్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల ఏర్పాట్లప బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ఉదయం 8.30 నుంచి 9.15 గంటల మధ్య పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 9.30 గంటల వరకు మాత్రమే గ్రేస్ పీరియడ్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, లేకుంటే ఉద్యోగి గుర్తింపుకార్డు వంటి అసలు గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యేవరకు ఎవరూ హాల్‌ను విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు. కంప్యూటర్, విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పరీక్షలకు అంతరాయం కలగకుండా చూడాలని టీసీఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులను ఆదేశించారు. లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి అవసరమైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు తదితర ఎలకా్ట్రనిక్ పరికరాలకు అనుమతి లేదని సూచించారు.