నేడు, రేపు మహానాడు సంరంభం
ABN , Publish Date - May 27 , 2026 | 01:35 AM
తెలుగుదేశం పార్టీ మహానాడు సంరంభం నేడు, రేపు గ్రామ స్థాయిలో ప్రతిఫలించనుంది.జన జాతరను, మహోత్సవాలను తలపించే రీతిలో మహానాడు సంబరాలు ఏటా జరగడం తెలిసిందే.
సెగ్మెంట్‌కు 12 క్లస్టర్లలో వర్చువల్‌గా వీక్షణకు ఏర్పాట్లు
తిరుపతి, మే 26 (ఆంధ్రజ్యోతి):తెలుగుదేశం పార్టీ మహానాడు సంరంభం నేడు, రేపు గ్రామ స్థాయిలో ప్రతిఫలించనుంది.జన జాతరను, మహోత్సవాలను తలపించే రీతిలో మహానాడు సంబరాలు ఏటా జరగడం తెలిసిందే. పార్టీ మీద అభిమానంతో నేతలు పిలిచినా పిలవకున్నా, వాహనాలు ఏర్పాటు చేసినా చేయకున్నా, వసతి కల్పించినా కల్పించకపోయినా తమకు తాముగా వేలాదిమంది కార్యకర్తలు సొంత ఖర్చులతో వెళ్ళి మహానాడుకు హాజరయ్యే సంస్కృతి టీడీపీలో తొలి నుంచీ వుంది.ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో జరగాల్సిన టీడీపీ మహానాడు అనివార్య కారణాలతో రద్దయింది. అమెరికా-ఇరాన్ యుద్ధ నేపధ్యంలో దేశ ప్రధాని పొదుపు పాటించాలంటూ ఇచ్చిన పిలుపుతో స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు బహిరంగసభను రద్దు చేశారు.దానికి ప్రత్యామ్నాయంగా వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడుకు స్వయంగా రాలేని వారు కూడా తమ గ్రామాల నుంచే వీక్షించే
విధంగా క్లస్టర్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని పార్టీని ఆదేశించారు. దీంతో జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 12 క్లస్టర్లలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. క్లస్టర్ కేంద్రాల్లో ఈనెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచీ సాయంత్రం 5 గంటల వరకూ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమాలను యధాతధంగా క్లస్టర్ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలు ఎల్‌ఈడీ స్ర్కీన్ల మీద వీక్షించే సదుపాయం కల్పించారు. దీనికోసం జిల్లాలోని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఫంక్షన్ హాళ్ళలోనూ, మరికొన్ని చోట్ల ఆరుబయట టెంట్లు వేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు.పార్టీ చరిత్రలో ఏ మహానాడుకూ హాజరు కానంత ఎక్కువ మంది
కార్యకర్తలు ఈ పర్యాయం వర్చువల్ సమావేశాల ద్వారా మహానాడును వీక్షించనున్నారు.నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని బట్టి సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఆర్థిక భారాన్ని ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు, క్లస్టర్ ఇంఛార్జులు భరిస్తున్నారు.మహానాడు సమావేశాలను క్లస్టర్ స్థాయిలో నిర్వహిస్తున్న నేపధ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జులు ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లోనే అందుబాటులో వుండనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సమావేశాలలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారు.