తిరుపతిని వరద ముంచెత్తకుండా..!
ABN , Publish Date - May 04 , 2026 | 02:12 AM
తిరుపతిలో ఎస్‌డబ్ల్యూడీ (వర్షపు నీటి కాలువలు) అవసరం ఉన్నప్పటికీ కార్పొరేషన్‌లో నిధుల కొరత పట్టి పీడిస్తోంది. యూసీఎఫ్ కింద లక్ష కోట్ల నిధులు కేంద్రం వద్ద ఉన్నాయి. ప్రతిపాదనలు అందిన వెంటనే 25శాతం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మిగిలిన 75 శాతం వాటా సమీకరించుకోవడంలోనే సమస్య. తిరుపతి కార్పొరేషన్‌లో వైసీపీ ప్రభుత్వం దిగిపోతూ జీరో బ్యాలెన్స్ చేసి పోయింది. అనేక ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏదైనా భారీ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది.
పట్టాలెక్కనున్న ఎస్‌డబ్ల్యూడీ ప్రాజెక్టు
రూ.113.51కోట్లతో కార్పొరేషన్ ప్రతిపాదనలు
25 శాతం కేంద్ర అర్బన్ చాలెంజ్ నిధులు
మిగిలిన వాటా రాష్ట్ర ప్రభుత్వ, మున్సిపాల్టీదే
తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి
మన వాటాతోనే తిప్పలు
తిరుపతిలో ఎస్‌డబ్ల్యూడీ (వర్షపు నీటి కాలువలు) అవసరం ఉన్నప్పటికీ కార్పొరేషన్‌లో నిధుల కొరత పట్టి పీడిస్తోంది. యూసీఎఫ్ కింద లక్ష కోట్ల నిధులు కేంద్రం వద్ద ఉన్నాయి. ప్రతిపాదనలు అందిన వెంటనే 25శాతం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మిగిలిన 75 శాతం వాటా సమీకరించుకోవడంలోనే సమస్య. తిరుపతి కార్పొరేషన్‌లో వైసీపీ ప్రభుత్వం దిగిపోతూ జీరో బ్యాలెన్స్ చేసి పోయింది. అనేక ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏదైనా భారీ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది.
87 కిలోమీటర్ల నిర్మాణం
ప్రస్తుతం కేవలం 40 శాతం వరకు మాత్రమే ఉన్న ఎస్‌డబ్ల్యూడీ కవరేజ్‌ను వంద శాతం తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్‌డబ్ల్యూడీని తొలి ప్రాధాన్యంగా అధిక జనసాంద్రత గల ప్రాంతాలను, పేదలు, దళిత వాడలను తీసుకున్నారు. నగరంలో ఈప్రాంతాలు 31.25 కిలోమీటర్లు ఉండగా ఇక్కడ నిర్మాణం కోసం రూ.5083.40 లక్షల ఖర్చుతో ప్రణాళికలు వేశారు. అదేవిధంగా రెండో ప్రాధాన్యంగా 35.24 కిలోమీటర్ల కీలక ప్రాంతాలకోసం రూ.3349 లక్షలను, 20.13 కిలోమీటర్ల నగర సరిహద్దు ప్రాంతాలు, కొత్తగా చేరిన ప్రాంతాల కోసం రూ.2918 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 86.62 కిలోమీటర్లకుగాను రూ.113.51 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
ప్రతిపాదనలిలా (కిలోమీటర్లలో)
వర్షపు నీటి కాలువల పొడవు : 820.20
ప్రస్తుతం ఉన్న
ఎస్‌డబ్ల్యూడీ నెట్‌వర్క్ : 730
జరుగుతున్న పనులు: 3.50
లోటు దూరం: 86.62
ఐదారు నెలల్లో పట్టాలెక్కుతుంది
మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఎస్‌డబ్ల్యూడీ రూ.113.51కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం 25శాతం వాటా ఇవ్వనుంది. మిగిలిన వాటాను లోన్లు ద్వారానో, జనరల్ ఫండ్ నుంచో సమీకరించుకోవాలి. అంతా అనుకున్నట్టు జరిగితే ఐదారు నెలల్లో ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఇది పూర్తయితే తిరుపతిలో వరద నీటి ముంపు నుంచి విముక్తి కలుగుతుంది.
- శ్యాంసుందర్, ఎస్‌ఈ, తిరుపతి నగరపాలక సంస్థ