Share News

తిరుపతి మేయర్‌ జనరల్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:18 AM

జిల్లాలో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల మేయర్‌, ఛైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి

 తిరుపతి మేయర్‌ జనరల్‌

తిరుపతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల మేయర్‌, ఛైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తిరుపతి మేయర్‌ పీఠం జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.దీంతో పోటీ బాగా పెరిగే పరిస్థితి నెలకొంది. టీడీపీ విషయానికొస్తే బలిజ సామాజికవర్గం నుంచీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు భట్టు కీర్తి, సీనియర్‌ నేత కోడూరు బాలసుబ్రమణ్యం రేసులో వున్నారు. యాదవ సామాజికవర్గం నుంచీ కుటుంబసభ్యుల కోసం సీనియర్‌ నేత నరసింహ యాదవ్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆ వర్గంలోనే సీనియర్‌ నేత దంపూరి భాస్కర్‌ యాదవ్‌, జిల్లా తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత తదితరుల పేర్లు ప్రచారంలో వున్నాయి. రెడ్డి సామాజికవర్గం నుంచీ సీనియర్‌ నేత మబ్బు దేవనారాయణరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే కమ్మ సామాజికవర్గం నుంచీ మాజీ డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. జనసేన పార్టీలో నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్‌ రాయల్‌ తనకు గానీ లేదా సతీమణికి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అలాగే గేట్‌ విద్యాసంస్థ కరస్పాండెంట్‌ వెంకటేశ్వర్లు కూడా రేసులో వున్నారు.కాగా తిరుపతి మేయర్‌ పదవి కూటమి పార్టీల సర్దుబాట్లలో భాగంగా బీజేపీకి కేటాయించారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి తన కుటుంబసభ్యుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో ఈ ప్రచారం మొదలు కావడం గమనార్హం. ఆ పార్టీలోనే జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌ పేరు కూడా ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది.వైసీపీలో పార్టీ ముఖ్య నేతలు ప్రధానంగా మాజీ మేయర్‌ డాక్టర్‌ శిరీష వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.అయితే ఆర్థిక కారణాలు చూపుతూ శిరీష ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతోంది.ఈ ప్రయత్నాలు ఫలించని పరిస్థితి వస్తే భూమన అభినయ్‌, పెద్దిరెడ్డి అనుచరుడు ఎమ్మార్సీ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి.

శ్రీకాళహస్తి మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు ఖరారైంది. ఈ పదవి కోసం టీడీపీ నుంచీ రజక సామాజికవర్గానికి చెందిన నాయకుడు, ఎమ్మెల్యే సన్నిహిత అనుచరుడైన దుర్గా ప్రసాద్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. అలాగే మరో సీనియర్‌ నేత విశ్వబ్రాహ్మణ దశరధాచారి, వన్నెరెడ్డి సామాజికవర్గానికి చెందిన మిన్నల్‌ రవి, పేట బాలాజీరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జనసేన నుంచీ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మిద్దెల హరి రేసులో వున్నారు. బీజేపీ నుంచీ ఇప్పటికైతే ఆశావహుల పేర్లు ఏవీ బయట రాలేదు. కాగా వైసీపీ నుంచీ మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ మధురెడ్డి అలియాస్‌ దాస్‌ పేరు ప్రచారంలో వుంది.వెంకటగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వయింది. ఇక్కడ టీడీపీ నుంచీ ఎమ్మెల్యే కుమార్తె కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియ పేరు తెరపైకి వచ్చింది. అలాగే పద్మశాలి వర్గానికి చెందిన మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ దొంతు శారద పేరు ప్రచారంలో వుంది. జనసేన, బీజేపీల నుంచీ ఆశావహులు ఎవరూ రేసులో లేరు. అదే సమయంలో వైసీపీకి సంబంధించి కూడా ఆశావహుల పేర్లు ఇప్పటి వరకూ తెరపైకి రాలేదు.సూళ్ళూరుపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఎస్సీ మహిళకు ఖరారైంది. ఈ పదవి కోసం టీడీపీ నుంచీ మాజీ ఎంపీపీ పిట్ల సుబ్రమణ్యం సతీమణి సుభాషిణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.జనసేన, బీజేపీల నుంచీ ఆశావహులెవరూ రేసులో లేరు. వైసీపీ పరిస్థితి గందరగోళంగా వుంది. ఇప్పటికైతే మాజీ కౌన్సిలర్‌ ముత్తుకూరు లక్ష్మమ్మ పేరు మాత్రమే ప్రచారంలో వుంది.నాయుడుపేటలో మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించారు. ఇక్కడ టీడీపీ నుంచీ మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ విజయ్‌భాస్కర రెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ 786 రఫీ వంటి నేతలు తమ కుటుంబ సభ్యుల కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం. అలాగే బీజేపీ నుంచీ జిల్లా మాఽజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, జనసేన నుంచీ అట్ల కృష్ణారావు కూడా కుటుంబీకులకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారంలో వుంది. ఇక వైసీపీలో కూడా నేతలు కామిరెడ్డి రాజారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు తమ కుటుంబీకుల కోసం అధిష్ఠానం వద్ద పట్టుబడుతున్నారని తెలిసింది.పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు ఖరారైంది. ఇక్కడ టీడీపీ నుంచీ మాజీ ఎంపీపీ ఏలుమలై, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్లు యుగంధర్‌, ఎంఎస్‌ కరుణాకరన్‌, అలాగే రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌, మాజీ ఎంపీపీ గంజి మాధవయ్య, పట్టణ అధ్యక్షుడు గాలి జీవరత్నం నాయుడు తదితర సీనియర్‌ నేతలు తమ కుటుంబసభ్యుల కోసం పట్టుబడుతున్నారని సమాచారం. జనసేన, బీజేపీల నుంచీ ప్రస్తుతానికి ఆశావహులెవరూ తెరమీదకు రాలేదు. వైసీపీలో మాత్రం మాజీ కౌన్సిలర్‌ ఏకాంబరం, మాజీ వైస్‌ ఛైర్మన్‌ జయప్రకాష్‌ వంటివారు తమ కుటుంబీకుల కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం.

Updated Date - Oct 13 , 2026 | 12:18 AM