తిరుపతి కమిషనర్ లాగిన్ దుర్వినియోగం
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:24 AM
రుపతి మున్సిపల్ కమిషనర్ లాగిన్ ఐడీ, పాస్ వర్డులను కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారు.
తిరుపతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కమిషనర్ లాగిన్ ఐడీ, పాస్ వర్డులను కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అన్ రిజిస్టర్డ్ స్థలాల్లోని ఇళ్ళ యజమానుల పేర్లను అక్రమంగా మ్యుటేషన్ చేసేశారు. సుమారు 190 అసెస్సీల పేర్లు మార్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో కమిషనర్ మౌర్య నేరుగా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. అలాగే తన ఆన్‌లైన్ లాగిన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారంటూ మున్సిపల్ పరిపాలనా శాఖ డైరెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.తిరుపతి నగరంలో 69 మురికివాడలున్నాయి. చాలావరకూ ఆయా ప్రాంతాలు డీకేటీ లేదా ప్రభుత్వ భూములు. ఆ స్థలాల్లో నిర్మించినందున ఇళ్ళు, భవనాలు రిజిస్టర్ కావు. అమ్మకాలు, కొనుగోళ్ళు అనధికారికంగానే జరిగిపోతుంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ రికార్డుల్లో మురికివాడలుగా నమోదైనప్పటికీ వీటిలో అనేక ప్రాంతాల్లో ఇళ్ళ ఽఖరీదు ఎక్కువగానే వుంది. మున్సిపల్ కార్యాలయంలో ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ మున్సిపల్ కమిషనర్ లాగిన్‌ను వినియోగించి ఈ 69 మురికివాడల్లోనూ 190 అసెస్సీలను మ్యుటేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల ఇంటి పన్ను వసూలు చేసేందుకు బిల్ కలెక్టర్లు ఆయా ప్రాంతాలకు వెళ్లినపుడు ఈ సంగతి వెలుగు చూసింది. పన్ను బకాయిలు చెల్లించాలని అడిగే క్రమంలో బిల్ కలెక్టర్లు తమ వద్ద వున్న రికార్డుల్లో నమోదైన యజమానుల పేర్లు చెప్పడం, దాంతో ఆయా ఇళ్ళలో నివాసం వున్న అసలైన యజమానులు వారిపైకి గొడవకు దిగారు. దీంతో కంగారుపడిన బిల్ కలెక్టర్లు వెంటనే పై అధికారులకు సమాచారమిచ్చారు. వారు కూడా పదిరోజుల పాటు రికార్డులన్నీ పరిశీలించారు. 190 ఇళ్ళ యజమానుల పేర్లు ఆన్‌లైన్‌లో మారిపోయినట్టు గుర్తించారు. 69 మురికివాడల్లోనూ ఇలాంటి కేసులు ఒకటి రెండు చొప్పున వున్నట్టు గుర్తించారు. ఇళ్ళ యజమానుల పేర్లు మారాలంటే మున్సిపల్ కమిషనర్ లాగిన్ నుంచే చేయాల్సి వుంటుంది. దీంతో అధికారులు వెంటనే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళారు. తన లాగిన్ దుర్వినియోగమైనట్టు తెలియడంతో కమిషనర్ మౌర్య సీరియస్ అయ్యారు. గురువారం సాయంత్రం నేరుగా ఎస్పీ సుబ్బరాయుడిని కలసి ఫిర్యాదు చేశారు. అలాగే మున్సిపల్ పాలనా శాఖ డైరెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇలా ఇళ్ళ యజమానుల పేర్లు ఎందుకు అక్రమంగా మార్చారన్నది అంతుబట్టడం లేదు. సాధారణంగా ఐఏఎస్ అధికారైన మున్సిపల్ కమిషనర్ లాగిన్ ఐడీ, పాస్ వర్డులు ఇతరులకు తెలిసే అవకాశం వుండదు. అలాంటిది ఆ స్థాయి అధికారి లాగిన్‌నే దుర్వినియోగం చేయడమంటే ఆషామాషీ కాదు. గతంలోనూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎపిక్ కార్డులు అక్రమంగా డౌన్‌లోడ్ చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇపుడు కమిషనర్ లాగిన్ నుంచీ ఇళ్ళ యజమానుల పేర్లు మార్చడం కార్యాలయంలో కలకలం రేపింది. ఎస్పీ దర్యాప్తునకు ఆదేశిస్తే ఇది ఇంటి దొంగల పనా లేక బయటి వ్యక్తుల పనా అన్నది తేలనుంది. అలాగే ఏ ఉద్దేశంతో ఈ పనిచేశారనేది కూడా తెలియనుంది.