Share News

మెగా సిటీగా తిరుపతి- హోమ్‌ స్టే సంస్కృతి

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:09 AM

తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

మెగా సిటీగా తిరుపతి- హోమ్‌ స్టే సంస్కృతి
గ్రామదేవతకు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు పూజలు

తిరుపతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): విశాఖ, విజయవాడతో పాటు తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారం నారావారిపల్లెలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిటీ ఆఫ్‌ ట్యాంక్స్‌గా మార్చేందుకు తిరుపతిలోని 20 నుంచీ 25 చెరువులను తుడాకు అప్పగిస్తామన్నారు. ‘తిరుపతి రూరల్‌లోని అవిలాల, పేరూరు చెరువులను ట్యాంక్‌ బండ్‌ తరహాలో అభివృద్ధిచేసి పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం. హోమ్‌ స్టేల సంస్కృతిని ప్రోత్సహిస్తాం. తిరుపతిని మోస్ట్‌ ప్రిఫర్డ్‌ వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా అభివృద్ధి పరుస్తాం. శెట్టిపల్లెలో భూ వివాదం పరిష్కారమైనందున అక్కడ స్టార్‌ హటళ్లు, వర్క్‌ స్టేషన్లు, కన్వెన్షన్‌ సెంటర్లు తెస్తాం. కంభంవారిపల్లి మండలం అడవిపల్లి రిజర్వాయర్‌ నుంచీ నీవా బ్రాంచి కెనాల్‌ ద్వారా ఈ ఏడాది చిత్తూరు నగర తాగునీటి అవసరాల కోసం హంద్రీ-నీవా జలాలు అందిస్తాం. త్వరలో కళ్యాణి డ్యామ్‌ లేదా కండలేరు నుంచి చంద్రగిరి మండలంలోని నాగపట్ల, కొటాల, కోమటి చెరువులు నింపి తాగునీటి కొరత లేకుండా చూస్తాం. ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా తాగునీళ్లు ఇస్తాం’ అని అన్నారు.

‘స్వర్ణ నారావారిపల్లె’ ప్రాజెక్టు విజయవంతం

‘చంద్రగిరి మండలంలోని రంగంపేట, కందులవారిపల్లి, చిన్న రామాపురం పంచాయతీల పరిధిలో స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టుకు గతేడాది శ్రీకారం చుట్టాం. ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని లక్ష్యం పెట్టుకున్నాం. కలెక్టర్‌, డీపీవో తదితరులు బాగా పనిచేశారని వారిని అభినందించారు. ప్రాజెక్టు పరిధిలో 247 కుటుంబాలకు పక్కా ఇళ్లు, 184 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. నారావారిపల్లె నుంచి పదిపుట్ల బైలుకు నేరుగా రోడ్డు సదుపాయం కల్పిస్తాం. రంగంపేటకు బైపాస్‌ రోడ్డు వేసి జాతీయ రహదారితో కలుపుతాం. అన్ని గ్రామాల్లో డ్రైనేజీ, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ చేపడతాం. పొడిచెత్తతో కంపోస్టు తయారీ, తడిచెత్తతో పవర్‌ జనరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.

త్వరలో సోలార్‌ బ్యాటరీ స్టోరేజీ

నారావారిపల్లె ప్రాంతంలో త్వరలోనే సోలార్‌ బ్యాటరీ స్టోరేజీ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఇంటికీ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేశామన్నారు. మిగులు విద్యుత్‌ ఉంటే గ్రిడ్‌కు ఇస్తామన్నారు. త్వరలో సోలార్‌ బ్యాటరీ స్టోరేజీ సదుపాయం ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి వ్యయం లేకుండా స్కూటర్లు, ట్రాక్టర్లు, కార్లు రీఛార్జి చేసుకోవచ్చన్నారు. కుసుమ్‌ పథకం కింద వ్యవసాయ పంపుసెట్లకు సోలార్‌ పవర్‌ అందిస్తామన్నారు. నారావారిపల్లె ప్రాంతం నుంచీ పంట దిగుబడులను తిరుపతికి, తిరుపతి రైతు బజారుకు తరలిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు జియో ట్యాగింగ్‌ చేయడం వల్ల తాము కొన్న పంట ఏ రైతు, ఏ పొలంలో పండించిందీ కొనుగోలుదారులకు తెలుస్తుందన్నారు. నారావారిపల్లె ప్రాంతంలో పాడియావులు సగటున 5.79 లీటర్ల పాలు ఇస్తుండగా.. దాన్ని 8.8 లీటర్లకు పెంచామన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:09 AM