Share News

బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధం

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:43 AM

బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ సిద్ధమైంది.తొమ్మిదిరోజుల సంబరానికి తిరుమల క్షేత్రం పుష్ప, విద్యుత్‌ అలంకరణలతో సర్వాంగసుందరంగా ముస్తాబైంది

 బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధం
పుష్ప అలంకరణ

తిరుమల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ సిద్ధమైంది.తొమ్మిదిరోజుల సంబరానికి తిరుమల క్షేత్రం పుష్ప, విద్యుత్‌ అలంకరణలతో సర్వాంగసుందరంగా ముస్తాబైంది.సోమవారం సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి 9 నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.బుధవారం నుంచి రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతుడై వివిధ వాహనాలపై కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

కనువిందు చేస్తున్న విద్యుద్దీపాలంకరణ

బ్రహ్మోత్సవాలకు తిరుమలలో టీటీడీ ఈసారి మరింత సౌందర్యవంతమైన విద్యుత్‌, పుష్పాలంకరణలు చేసింది. దాదాపు 15 నుంచి 70 అడుగుల ఎత్తులో 25 భారీ విద్యుత్‌ కటౌట్లు ఏర్పాటు చేశారు. అలిపిరి గరుడసర్కిల్‌ నుంచి శ్రీవారి ఆలయం వరకు విద్యుత్‌ అలంకరణలు ఆకర్షిస్తున్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు ప్రధాన ప్రాంతాలలో ఎల్‌ఈడీ, పార్కాన్‌ లైట్లతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు. ఆలయం ముందు ఏర్పాటు చేసిన ‘శ్రీనివాస కల్యాణం’, ‘బ్రహ్మాండనాయకుడు వేంకటేశ్వరస్వామి’, ‘తొండమనాడు వేంకటేశ్వరస్వామి’, ‘అమ్మవారిపై శ్రీమహావిష్ణువు’ కూడా ఆకట్టుకుంటున్నాయి.ఏటా 8 నుంచి 10 టన్నుల పుష్పాలతో అలంకరణలు చేపడతారు.ఈసారి దాదాపు 12 టన్నుల సంప్రదాయ పుష్పాలతో స్వామి క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. 6 టన్నులతో శ్రీవారి ఆలయంలోపల, మరో 6 టన్నులతో వెలుపల అలంకరణలు చేపట్టారు. ముఖ్యంగా ఈసారి లక్ష కట్‌ఫ్లవర్స్‌తో శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం ప్రాంతాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు.గరుడసేవ ముందురోజు, మహారథం ముందురోజు ఈ పుష్పాలంకరణను మార్చనున్నారు.

ఆకట్టుకుంటున్న పుష్పప్రదర్శన శాల

తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఫలపుష్పప్రదర్శన శాల దాదాపుగా సిద్ధమైంది. వివిధ రకాల రంగులతో దాదాపు లక్ష మొక్కలను ఈసారి ప్రదర్శనలో ఉంచారు. ఇందులో 18 నుంచి 20 రకాల పుష్పమొక్కలను వివిధ రంగుల్లో ఒకేచోట చూసే అవకాశముంది. ఇక, పండ్లు, కూరగాయలతో పక్షులు, జంతువులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది ‘శిశుపాలుని వధ’ సెట్టింగ్‌ను’ వేశారు. అలాగే ‘కల్కి అవతారం’ సాండ్‌ ఆర్ట్‌తో పాటు మూడు యుగాలకు చెందిన దాదాపు 15 ఘట్టాలు తెలిపేలా సెట్టింగులు ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 14 , 2026 | 01:43 AM