పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 15 , 2026 | 02:14 AM
చిత్తూరు జిల్లాలో సోమవారం నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు.
డీఈవో రాజేంద్రప్రసాద్
చిత్తూరు సెంట్రల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు. రోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్న నేపఽథ్యంలో విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. అలాగే హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 23,095 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. ఇందుకోసం 129 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెంటర్‌లోనూ గాలి, వెలుతురు, తాగునీరు, వాష్‌రూం, మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జెరాక్స్ సెంటర్లు మూసివేయిస్తామన్నారు. గుర్తింపుపొందిన ప్రైవేట్ పాఠశాలల్లోని టీచర్లను సైతం ఈసారి ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వం అనుమతించిందన్నారు. అత్యంత సున్నితంగా భావించే 93 సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నాపత్రంపై యునిక్ నంబరు ముద్రించిన నేపఽథ్యంలో ఏ సెంటర్ నుంచైనా ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలిస్తే, ఈ సెంటర్‌లోని అందరి అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ అధికారీ సెల్‌ఫోన్ వినియోగించరాదన్నారు. సలహాలు, సందేహాల నివృత్తికి 24 గంటలు పనిచేసేలా డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం(90321 85001) ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల అరగొండలోని ప్రభుత్వ పాఠశాలల్లోని సెంటర్లలో మాస్ కాఫీయింగ్ జరిగిందననే ఫిర్యాదుపై విచారణకు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పరీక్షల సహాయ కమిషనర్ జయప్రకాష్‌నాయుడు, సూపరింటెండెంట్ స్వర్ణకుమారి, పరీక్షల సెక్షన్ అధికారి సలార్‌ఖాన్ పాల్గొన్నారు. కాగా ఓపెన్ స్కూల్ టెన్త్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. 1063 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 18 సెంటర్లు ఏర్పాటు చేశారు.. ప్రతి సెంటర్‌లో సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించారు.