Share News

ప్రపంచ రికార్డుకు మూడేళ్ల చిన్నారి సాహసం

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:06 AM

మూడేళ్ల చిన్నారి జాతీయ రహదారిపై 79 కిలోమీటర్ల పాటు స్కేటింగ్‌ చేస్తూ ప్రపంచ రికార్డుకు ప్రయత్నిస్తున్నాడు. శుక్రవారం మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్ట సర్కిల్‌ నుంచి సత్యసాయి జిల్లా కదిరి వరకు స్కేటింగ్‌ యాత్ర ప్రారంభించాడు.

ప్రపంచ రికార్డుకు మూడేళ్ల చిన్నారి సాహసం
జాతీయ పతాకాన్ని చేతపట్టి యాత్ర చేస్తున్న దక్షిత్‌

- 79 కిలోమీటర్ల పాటు స్కేటింగ్‌

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మూడేళ్ల చిన్నారి జాతీయ రహదారిపై 79 కిలోమీటర్ల పాటు స్కేటింగ్‌ చేస్తూ ప్రపంచ రికార్డుకు ప్రయత్నిస్తున్నాడు. శుక్రవారం మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్ట సర్కిల్‌ నుంచి సత్యసాయి జిల్లా కదిరి వరకు స్కేటింగ్‌ యాత్ర ప్రారంభించాడు. మదనపల్లెకు చెందిన అనంత వాసుదేవ, అనంతలక్ష్మి దంపతుల కుమారుడు అనంద దక్షిత్‌ రెండున్నర సంవత్సరాల వయసు నుంచి స్కేటింగ్‌లో తర్ఫీదు పొందాడు. గతంలో వి.కోట నుంచి సూళ్లూరుపేట వరకు స్కేటింగ్‌ చేశాడు. ప్రస్తుతం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కిలోమీటర్ల స్కేటింగ్‌ యాత్రను మొదలుపెట్టాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అదనపు ఎస్పీ వెంకటాద్రి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దక్షిత్‌ స్కేటింగ్‌ను నమోదు చేసుకునేందుకు గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కోఆర్డినేటర్‌ కె.రవికుమార్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఇండియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ నరేంద్రగౌడ్‌ వారి సిబ్బంది, కెమెరాలతో పాటు హాజరయ్యారు. యాత్రకు రక్షణగా కలికిరి చెందిన ఐటీబీపీ కమాండెంట్‌ సంజయ్‌కుమార్‌, ఎస్‌ఐ ధర్మసింగ్‌, హెచ్‌సీ బాలాజి, చంద్రశేఖర్‌ వారి సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, పట్టణ యువత పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 01:06 AM