Share News

పంచాయతీలకూ ‘త్రీ మెన్‌’ కమిటీలు?

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:12 AM

సర్పంచులకు బదులుగా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ముందు తాజాగా త్రీ మెన్‌ కమిటీల ప్రతిపాదనలు కూడా వున్నట్లు సమాచారం.

పంచాయతీలకూ ‘త్రీ మెన్‌’ కమిటీలు?

హైకోర్టు సూచనలతో సర్కారు తర్జనభర్జన

కలికిరి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి):సర్పంచులకు బదులుగా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ముందు తాజాగా త్రీ మెన్‌ కమిటీల ప్రతిపాదనలు కూడా వున్నట్లు సమాచారం.సర్పంచుల పదవీ కాలం గడువు ముగియగానే వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే.అయితే ఒక్కో అధికారికి మూడేసి పంచాయతీలను అప్పగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు తదితర అంశాలపై హైకోర్టులో వున్న వ్యాజ్యాలపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్పంచుల పదవీ కాలం ముగిసినందున వారి స్థానంలో స్పెషలాఫీసర్లను నియమించినట్లు ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ సందర్భంగా పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషలాఫీసర్లకు మూడేసి పంచాయతీలను అప్పగించడానికి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సందర్భంలో స్థానికంగా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కూడా ప్రభుత్వానికి కోర్టు సూచనలు జారీ చేసింది. మంగళవారం జరిగే విచారణ నాటికి ఈ రెండు అంశాలపై ప్రభుత్వ అభిప్రాయాలు తెలపాలని కూడా ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

త్రీ మెన్‌ కమిటీలపై తర్జనభర్జనలు

హైకోర్టు సూచనలతో పంచాయతీలకు త్రీ మెన్‌ కమిటీల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. ఎక్కువ భాగం ప్రజా ప్రతినిధులు త్రీ మెన్‌ కమిటీల వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెపుతున్నారు. ఎంసీటీసీ, జడ్పీటీసీల గడువు నవంబరుకు ముగుస్తుంది. అంటే ముందు వీటికి ఎన్నికలు పూర్తయిన తరువాత పంచాయతీ ఎన్నికలంటే.. 2027 ఫిబ్రవరి తరువాతే సాధ్యమవుతుందని, ఇంత సుదీర్ఘ కాలంపాటు ప్రత్యేక అధికారులతో పాలన సాగించడం కన్నా హైకోర్టు సూచనల ప్రకారం స్థానికులతో కమిటీలు ఏర్పాటు చేయడమే భావ్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మంగళవారం హైకోర్టులో జరిగే విచారణలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాల్సి వుంటుందని, దాన్నిబట్టి కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందని కూడా చెబుతున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 01:12 AM