Share News

బీచ్‌లో ముగ్గురు చిన్నారుల గల్లంతు

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:46 AM

నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. ఇద్దరి ఆచూకీ లభ్యం కాగా అందులో ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

బీచ్‌లో ముగ్గురు చిన్నారుల గల్లంతు
సుఫియాన్‌ (ఫైల్‌ ఫొటో)

- ఇద్దరి ఆచూకీ లభ్యం

- అందులో ఒకరి మృతి... మరొకరి పరిస్థితి విషమం

- కందూరులో విషాద ఛాయలు

సోమల, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. ఇద్దరి ఆచూకీ లభ్యం కాగా అందులో ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సోమల మండలం కందూరు నుంచి మహబూబ్‌జాన్‌, రఫీ, అన్సర్‌ కుటుంబ సభ్యులు 15 మంది కలిసి శుక్రవారం నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లారు. నెల్లూరు బారా షహీద్‌ దర్గాలో రొట్టెల పండుగలో పాల్గొన్నారు. శనివారం కొత్త కోడూరు బీచ్‌ వద్దకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో అలల ఉధృతికి రఫీ కుమార్తె షంరీన్‌ (14), కుమారుడు సుఫియాన్‌ (10), అన్సర్‌ కుమార్తె నబీషా (15) కొట్టుకుపోయారు. సమీపంలో ఉన్న వారు సుఫియాన్‌ను, షంరీన్‌ను పట్టుకున్నారు. అప్పటికే సుఫియాన్‌ మృత్యువాతపడ్డాడు. షంరీన్‌ను సమీపంలోని వైద్యశాలకు తరలించారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నబీషా (15) కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో కందూరులో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Jun 28 , 2026 | 12:46 AM