Share News

కూలి పనులకెళ్లి కానరాని లోకానికి..

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:54 AM

కూలి పనుల కోసం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లిన రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. 15మంది గాయపడ్డారు.

కూలి పనులకెళ్లి కానరాని లోకానికి..
రోడ్డు ప్రమాదానికి గురైన వాహనం

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): కూలి పనుల కోసం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లిన రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. 15మంది గాయపడ్డారు. శ్రీనివాసపురం పోలీసుల వివరాల మేరకు.. రామసముద్రం మండలానికి చెందిన 18 మంది కర్ణాటక రాష్ట్రం చింతామణి, అనూరు వద్ద చింతకాయలు రాల్చడానికి కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని వ్యానులో సొంత ఊరుకు బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రం, శ్రీనివాసపురం వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రామసముద్రం మండలం నారిగానిపల్లె గ్రామం పూలకుంట్లకు చెందిన శ్రీనివాసులు(25), వెంకటమ్మ(60) పాతూరుకు చెందిన మునెప్ప(61) అక్కడికక్కడే మృతి చెందారు. గంగాధర్‌, సరోజమ్మ, అశోక్‌, వెంకటరమణ, రమణమ్మ, చిన్న గంగులమ్మ, సావిత్రమ్మ, లక్ష్మీదేవమ్మ, అనిల్‌, విశ్వనాథ్‌తోపాటు మరో ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు శ్రీనివాసపురం పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను శ్రీనివాసపురం, కోలార్‌, మదనపల్లె ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసపురం ప్రభుత్వాస్ప్రతిలోని మార్చురీకి తరలించారు. మృతులలో శ్రీనివాసులుకు వివాహం కాలేదు. డిగ్రీ వరకు చుదువుకుని కూలి పనులకు వెళుతున్నాడు. ఇతనికి అన్న, చెల్లెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మదనపల్లె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు.

Updated Date - Feb 09 , 2026 | 01:54 AM