తొలివిడతలో మూడు స్వచ్ఛరథాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:14 AM
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం స్వచ్ఛరథాలను అందిస్తోందని డీపీవో కె.సుధాకరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన తొలివిడతగా చిత్తూరు, ఐరాల, బంగారుపాళ్యం మండల కేంద్రాల్లో స్వచ్ఛరథాలను స్థానిక ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.
24న చిత్తూరు, బంగారుపాళ్యం, ఐరాల మండల కేంద్రాల్లో ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం స్వచ్ఛరథాలను అందిస్తోందని డీపీవో కె.సుధాకరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన తొలివిడతగా చిత్తూరు, ఐరాల, బంగారుపాళ్యం మండల కేంద్రాల్లో స్వచ్ఛరథాలను స్థానిక ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. 2026 మార్చి నెలాఖరుకు మిగిలిన 24 మండలాల్లో సైతం స్వచ్ఛరథాలను ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామాల్లో ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించి అవసరమైన నిత్యావసర సరుకులు అందజేసేలా పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. వీటి బాధ్యతలను ఆయా పంచాయతీలు చూస్తాయన్నారు. మండల పరిషత్ నిధుల నుంచి స్వచ్ఛరథం డ్రైవర్‌కు రూ.25వేలు అందజేస్తారని వివరించారు. ఈ విధానంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని, పారిశుధ్యం మెరుగుపడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. పంచాయతీల్లో హరిత రాయబారులు ఇళ్ల నుంచి వ్యర్థాలు సేకరిస్తున్నప్పటికీ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించలేకపోతున్నారన్నారు. ఇకపై తడి, పొడి చెత్తను వేర్వేరుగానే సేకరిస్తారన్నారు. వ్యర్థాల మార్పిడి విధానంలో భాగంగా పొడి చెత్త వ్యర్థాల బరువును విలువ కట్టి నిత్యావసర సరుకులు అందజేస్తారన్నారు. ఇందులో భాగంగా వాహనాల్లో డిజిటల్ తూకాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కిలో ధర ప్రకారం ప్లాస్టిక్, గాజు, స్టీలు, అట్టపెట్టెలు, నూనె డబ్బాలు, ఎలకా్ట్రనిక్ వస్తువులు, కంప్యూటర్ సామగ్రి తదితర వస్తువులను గ్రామీణ ప్రజలు అందించి సరుకులు తీసుకోవచ్చన్నారు.