Share News

బెదిరింపులు, బలవంతపు సెటిల్‌మెంట్‌ కేసులో శ్రీచందు సహా ముగ్గురి అరెస్ట్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:46 AM

బెదిరింపులు, బలవంతపు సెటిల్‌మెంట్‌ కేసులో పరారీలో ఉన్న బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు బొంతలపల్లె చంద్రశేఖర్‌ అలియాస్‌ శ్రీచందు సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ రాజారెడ్డి చెప్పారు.

బెదిరింపులు, బలవంతపు సెటిల్‌మెంట్‌ కేసులో శ్రీచందు సహా ముగ్గురి అరెస్ట్‌

మదనపల్లె క్రైం, జూలై 8(ఆంధ్రజ్యోతి) : బెదిరింపులు, బలవంతపు సెటిల్‌మెంట్‌ కేసులో పరారీలో ఉన్న బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు బొంతలపల్లె చంద్రశేఖర్‌ అలియాస్‌ శ్రీచందు సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ రాజారెడ్డి చెప్పారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె వివేకానందనగర్‌కు చెందిన కళావతి పెద్ద కుమారుడు అనిల్‌కుమార్‌ భవనాలకు కమ్మికట్టే పనులు చేస్తుండేవాడు. కొన్ని రోజుల కిందట కుటుంబ అవసరాల నిమిత్తం స్నేహితుడైన పట్టణంలోని చీకిలగుట్టకు చెందిన నరేంద్ర వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. అందులో రూ.70వేలు చెల్లించగా, మిగతా రూ.30వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో నరేంద్ర, అతని తల్లిదండ్రులు గంగులప్ప, రమణమ్మ కలసి చీకిలగుట్టలో నివాసం ఉన్న శ్రీచందును సంప్రదించి డబ్బు తీసివ్వాలని కోరారు. ఈ క్రమంలో నలుగురూ కలసి గతేడాది జూలై 28న రాత్రి వివేకానందనగర్‌కు వెళ్లారు. ఇంట్లో ఉన్న కళావతిని అసభ్యకరంగా దూషించడమేగాక దాడి చేశారు. బలవంతంగా ఆమె చేత రూ.1.85లక్షలకు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. మాతో పెట్టుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి, చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీచందు సహా నరేంద్ర, అతని తల్లిదండ్రులపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీచందు ప్రోద్బలంతోనే వారంతా తనపై దాడిచేసి, బలవంతంగా నోట్లు రాయించుకున్నారని కళావతి అప్పట్లో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి ఐదు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 01:46 AM