తలకోనలో ఈసారి బాలాలయంలోనే దర్శనాలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:23 AM
మహాశివరాత్రిని పురస్కరించుకుని తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు చేశారు.ఆలయ చరిత్రలో ఉత్సవాలేమీ లేకుండా మొదటిసారిగా స్వామివారి దర్శనంతోనే శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
కళ్యాణోత్సవం సహా అన్ని ఉత్సవాలు రద్దు
ఎర్రావారిపాలెం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి):మహాశివరాత్రిని పురస్కరించుకుని తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు చేశారు.ఆలయ చరిత్రలో ఉత్సవాలేమీ లేకుండా మొదటిసారిగా స్వామివారి దర్శనంతోనే శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.కళ్యాణోత్సవం సహా అన్ని ఉత్సవాలను రద్దు చేశారు.ప్రస్తుతం రూ.19కోట్ల టీటీడీ నిధులతో సిద్ధేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం ప్రహరీ తప్ప మొత్తం తొలగించారు. ఆలయానికి నైరుతి దిశలో మర్రిమాను వెనుక వైపు తాత్కాలికంగా బాలాలయాన్ని ఏర్పాటు చేశారు.ఆలయ చైర్మన్ సోమనాథరెడ్డి,ఈవో రవీంద్ర రాజు, ట్రస్టు బోర్డు సభ్యులు సమావేశమై శివరాత్రి ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాన ఆలయం నిర్మాణంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉత్సవాలు జరపాలనేదానిపై కంచి స్వాముల సలహాలు తీసుకున్నారు.ఈ యేడాది శివరాత్రికి బాలాలయంలో దర్శనాలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ఛైర్మన్ సోమనాథ రెడ్డి ,ఈవో రవీంద్ర రాజు తెలిపారు.డీఎస్పీ ప్రసాద్, సీఐ ఇమ్రాన్, ఎస్‌ఐలు లోకేష్ విశ్వనాథ,కృష్ణయ్య, శ్రీనివాసులు,షేక్‌షా వలీతో పాటు 100మంది సివిల్ పోలీసులు,ఏఆర్ పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దొంగతనాల నిరోధంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 45 సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.కాగా తలకోన జలపాతం వద్దకు ఎవరినీ అనుమతించబోమని భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ, రూరల్ డీఎస్పీ మధు తెలిపారు. ఏనుగుల సంచారంతో పాటు ఎలుగు బంట్లు తిరుగుతుండడంతో అనుమతించడం లేదని తెలిపారు.