ఈ మీటర్ చాలా స్మార్ట్ గురూ..
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:09 AM
అపోహలు వీడితే అన్నీ ప్రయోజనాలే ఏక్షణమైనా కరెంటు బిల్లు తెలుసుకోవచ్చు ఇప్పటివరకు 57,974 స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
చిత్తూరు రూరల్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్ల విషయంలో అపోహలను తొలగించేందుకు విద్యుత్ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ మీటర్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగిస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్ట్ మీటర్ల సంఽఖ్య పెరుగుతోంది. వాస్తవానికి సరఫరాలో హెచ్చుతగ్గులు నివారించి నాణ్యమైన విద్యుత్‌ను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్లను తీసుకొచ్చింది. జిల్లాలో గతేడాది ఆగస్టులో వీటి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు అమర్చుతోంది. 19,389 ప్రభుత్వ కార్యాలయాలకుగాను 13,491 చోట్ల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసింది. 11,243 పరిశ్రమల సర్వీసులకు గాను 3921 మీటర్లను అమర్చింది. 57,820 కమర్షియల్ సర్వీసులకు గాను 33470 ఏర్పాటు చేసింది. విద్యుత్ సరఫరా వివరాలు గుర్తించేందుకు న్ని ట్రాన్స్‌ఫార్మర్లకు దీనిని అమర్చినట్లు అధికారులుతెలిపారు. కాగా వ్యవసాయ సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
నెమ్మదినెమ్మదిగా గృహసర్వీసులకూ..
ప్రస్తుతం గృహ వినియోగదారుల సర్వీసులకు కూడా ఏర్పాటు చేసే పని మొదలైంది. ముందుగా 200 యూనిట్లుపై బడి వాడే 7092 సర్వీసులకు స్టార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. తర్వాత అన్ని కేటగిరీల సర్వీసులకు అమర్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లు ఎక్కువ వస్తోందనే దురభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇది సరికాదని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటితో వినియోగదారులకు ప్రయోజనమే కలుగుతుందని వివరిస్తున్నారు.
స్మార్ట్ మీటర్లతో ప్రయోజనాలు...
విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండవు. నాణ్యమైన సరఫరా చేస్తుంది.
ఎప్పుడైనా బిల్లు వివరం తెలుసుకోవచ్చు. స్వీయ నియంత్రణకు అవకాశం ఉంటుంది.
ప్రతి నెలా ఒకే రోజున ఆటోమెటిక్‌గా బిల్లు దీడింగ్ తీసి జనరేట్ చేస్తుంది. ప్రస్తుతం రీడింగ్ సిబ్బంది వచ్చి నమోదు చేసి బిల్లు అందజేస్తున్నారు. యజమాని ఇంట్లో లేకపోతే వినియోగం పెరుగుతోంది. స్లాబ్ మారి అధిక బిల్లు చెల్లించే అవకాశం ఉంటుంది. స్టార్ట్ మీటరుతో ఈ ఇబ్బంది ఉండదు.
రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్ల వరకు వెళ్లవలసిన అవసరం లేదు. విద్యుత్ శాఖ కార్యాలయంలోనే బిల్లులను జనరేట్ చేయవచ్చు.
విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే ఏ ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య వచ్చిందో ఏఈ, లైన్‌మెన్లకు మెసేజ్ వెళ్తుంది. దీంతో తక్కువ సమయంలోనే సమస్య పరిష్కారమవుతుంది.
ఎక్కువ కరెంటు సరఫరాను తట్టుకునే సామర్థ్యం ఉండడంతో మీటర్లు కాలే అవకాశం ఉండదు.
బిల్లు రీడింగ్ సిబ్బంది కోసం ఎదురు చూడనక్కరలేదు.