దొంగా.. దొంగా
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:18 AM
బోర్ల వద్ద కేబుల్ వైర్ల అపహరణ కాల్చి.. రాగితీసి విక్రయం వరుస చోరీలతో రైతుల ఆందోళన
మదనపల్లె, జూలై 7(ఆంధ్రజ్యోతి): మదనపల్లె డివిజన్‌లో చోరీలు అధికమయ్యాయి. పట్టణం, పల్లెల్లో ఇళ్లలోనే కాదు.. వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లను దొంగలిస్తున్నారు. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా రెండు వందలకు పైగా బోర్ల వద్ద కేబుళ్లను చోరీ చేసి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మదనపల్లె మండలంలోని పోతబోలు, కొత్తవారిపల్లె, గుండావారిపల్లె, కురవపల్లె, పూలవాండ్లపల్లె, గాజులవారిపల్లె తదితర గ్రామాల్లో శనివారం రాత్రి ఒకే రోజు 50 ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. స్టార్టర్ నుంచి బోరు వరకూ అమర్చిన డబుల్ కేబుళ్లను కత్తిరించుకెళ్లారు. శానిటోరియం ఫ్లైవోవర్ బ్రిడ్జి(సీటీఎం చెరువు) నుంచి పూలవాండ్లపల్లె వరకూ హైవే వెంట అటు..ఇటు ఉన్న బోర్లు, బావుల వద్ద కట్ చేశారు. అంతకుముందు నాలుగురోజుల క్రితం సీటీఎం నుంచి పోతబోలు మీదుగా నిమ్మనపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లె వెళ్లే రోడ్లు, భవనాల శాఖ రోడ్డు వెంట ఉన్న బావులు, బోర్లలో ఫీజు క్యారియర్లతో సహా కేబుళ్లను తీసుకెళ్లారు. ఒక్కో బావి, బోరు వద్ద కనీసం పది మీటర్ల నుంచి 50మీటర్లు వరకూ వైరు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అది కూడా డబుల్ వైరు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. గతంలో దుండగులు వ్యవసాయ బోర్లు, బావుల వద్ద అమర్చిన హెచ్‌వీడీఎస్ ట్రాన్స్‌ఫార్మర్లను కొట్టేసి అందులో రాగివైర్లను తీసుకెళ్లేవారు. ఎక్కడ చూసినా వరుస చోరీలు జరుగుతుండటంతో రెండోసారి అల్యూమినియంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను వైరింగ్ చేస్తున్నారు. అది గిట్టుబాటు కాకపోవడం, పైగా అల్యూమినియం, విద్యుత్తు లైన్ కండెక్టర్ ఎక్కడా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వాటికి బ్రేక్ పడింది. అప్పుసప్పో చేసి బావులు, బోర్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసుకుంటే దొంగలు ఇలా నష్టం కలిగించడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు.
రాగివైర్లపై దృష్టి పెట్టిన చోరులు
బావుల వద్ద ఉన్న ఫీజు క్యారియర్లు, స్టార్టరు, కేబుల్, కండెక్టర్‌ను గతంలో చోరీ చేసేవారు. వీటిపై పోలీసులు నిఘా పెట్టడంతో వ్యాపారులు కొనడం మానేశారు. దీంతో దొంగలు వాటిని వదిలేసి తక్కువ మొత్తంలో ఎక్కువ డబ్బు వచ్చే రాగివైర్లు ఉండే కేబుల్‌పై దృష్టి పెట్టారు. కేబుల్ వైర్లను కట్ చేసి పైనున్న ఇన్సులేషన్ కాల్చేసి, రాగి ముద్దలను తీసుకెళ్లి బయటి ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. గతంలోనూ ఇదే రాగి వైరు ఉండే పెద్దపెద్ద టాన్స్‌ఫార్మర్లను ఽధ్వంసం చేసి పెద్దమొత్తంలోని రాగివైరును విక్రయించేవారు. బావులు, బోర్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ అవుతుండగా మేల్కొన్న టాన్స్‌కో అధికారులు ప్రస్తుతం అందులో రాగివైరు బదులు అల్యూమినియంతో వైరింగ్ చేస్తున్నారు. దీంతో చోరులు వాటి ఛాయలకు వెళ్లడం లేదు. గ్రామాల్లో ఎక్కువగా పంటలు సాగు చేయకపోవడం, ఉన్న చోట కూడా పగటి పూట మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతుండటంతో రైతులు రాత్రివేళలో బావులు, బోర్ల వద్దకు వెళ్లడం లేదు. దీన్ని అదునుగా చేసుకున్న దొంగలు అయినకాడికి పని కానిచ్చేస్తున్నారు. స్టార్టర్ నుంచి బోరు వరకూ భూమిలోపైపు ఏర్పాటు చేసి అందులో లాగిన కేబుల్‌ను ఈజీగా లాగేసి, కేబుల్‌ను కాల్చి రాగివైరును సొమ్ము చేసుకుంటున్నారు.
200కు పైగా బోర్ల వద్ద వైర్ల చోరీ
మొన్న నిమ్మనపల్లె మండలంలోని 20 గ్రామాల్లో, నిన్న రామసముద్రం, వాల్మీకిపురం మండలాల్లో 70 చోట్ల, తాజాగా మదనపల్లె మండలంలో వంద బోర్ల వద్ద చోరీ చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రాగి కిలో రూ.3,500 నుంచి 4వేలకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో చోరీ చేసిన కేబుల్స్ విక్రయించి సొమ్ము చేసుకోగా, తాజాగా అసలైన రాగి వైరునే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రామసముద్రం మండలంలోని చెంబకూరు, మాలేనత్తం, కుదురుచీమనపల్లె, మూగవాడి, ఏటవాకిలి, చొక్కాండ్లపల్లె, నిమ్మనపల్లె మండలంలోని అగ్రహారం, తవళం, నిమ్మనపల్లె, సామకోటవారిపల్లె, తదితర గ్రామాల్లో, వాల్మీకిపురం మండలంలోని వాల్మీకిపురం, చింతపర్తి, గండబోయనిపల్లె, జర్రావారిపల్లె తదితర గ్రామాలు వైరు చోరీకి గురైన జాబితాలో ఉన్నాయి.