Share News

దొంగా.. పోలీస్‌

ABN , Publish Date - May 18 , 2026 | 01:03 AM

కలిసి తమిళనాడువాసుల నుంచి డబ్బు లాక్కెళ్లిన వైనం

దొంగా.. పోలీస్‌
నిందితులను చిత్తూరు సబ్‌జైలుకు పంపించేముందు పోలీసులు

గంగాధరనెల్లూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): దొంగలను పట్టుకుని.. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వాళ్లిద్దరు. దొంగలతో చేతులు కలిపారు. బాధితుడి నుంచి డబ్బు లాక్కెళ్లి నిందితులుగా మారారు. పోలీసు శాఖకు మచ్చ తీసుకొచ్చారు. సంచలనంగా మారిన ఈ కేసు వివరాలను ఆదివారం సాయంత్రం సీఐ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. గంగాధరనెల్లూరు మండలం పెద్దకాల్వ పంచాయతీ మిట్టదళితవాడకు చెందిన ఎం.సెల్వం (51), సి.లక్ష్మణ్‌కుమార్‌ (32), తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా సైదాపేట కొత్తవీధికి చెందిన టి.ఇళంగోవన్‌ (56) ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా, పోచంపల్లె తాలుకా బైరల్లి గ్రామానికి చెందిన మంజునాథ్‌కు ఫోను చేసి.. గంగాధరనెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంకాయలు మాట్లాడి పెట్టామని చెప్పారు. డబ్బులు తెస్తే సరుకు తీసుకెళ్లొచ్చన్నారు. దీంతో మంజునాథ్‌ రూ.పది లక్షలు తీసుకొచ్చారు. ఈ డబ్బు కొట్టేసేందుకు తమకు పరిచయమున్న చిత్తూరులోని ఏఎ్‌సఐ కె.లోకనాథం, ఏఆర్‌ కానిస్టేబుల్‌ రవిచంద్రన్‌తో కలిసి ఈ ముఠా ప్రణాళిక వేసుకుంది. కాగా, ఈ ముఠా సూచన మేరకు మంజునాథ్‌ నగదుతో గంగాధరనెల్లూరు మండలం పెద్దకాల్వ పంచాయతీ బట్టుకండిగ సమీపంలోని డంపింగ్‌ యార్డు వద్దకు శనివారం సాయంత్రం వచ్చారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మంజునాథ్‌తో మాట్లాడుతున్న సమయంలో చిత్తూరు ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏఎ్‌సఐగా పనిచేస్తున్న లోకనాథం (గంగాధరనెల్లూరులో కాపురం), చిత్తూరులో ఏఆర్‌ కానిస్టేబుల్‌ పి.రవిచంద్రన్‌ (గంగాధరనెల్లూరు మండలం మిట్టవేల్కూరు దళితవాడ) అక్కడకు చేరుకున్నారు. ఇక్కడ దొంగనోట్లు చేతులు మారుతున్నట్లు సమాచారం వచ్చిందంటూ హడావుడి చేశారు. తమిళనాడుకు చెందిన మంజునాథ్‌ వద్దనున్న రూ.10లక్షల డబ్బును, ఫోనును ఏఎ్‌సఐ, ఏఆర్‌ కానిస్టేబుల్‌ లాక్కెళ్లిపోయారు. ముగ్గురు నిందితులూ అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో దిక్కుతోచని మంజునాథ్‌.. గంగాధరనెల్లూరు పోలీ్‌సస్టేషన్‌లో సీఐ ప్రసాద్‌ను ఆశ్రయించారు. ఆయన వెంటనే పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు తమ వాహనంలో బాధితుడిని ఎక్కించుకుని సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ్నుంచి వస్తుండగా వేర్వేరుచోట్ల ఏఆర్‌ కానిస్టేబుల్‌ రవిచంద్రన్‌, ఏఎ్‌సఐ లోకనాథం కనిపించడంతో సీఐ ప్రసాద్‌కు బాధితుడు చూపించారు. తనవద్ద డబ్బులు తీసుకెళ్లిన వారిలో వీరున్నారని చెప్పడంతో వారిని సీఐ అదుపులోకి తీసుకున్నారు. ఇళంగోవన్‌, సెల్వం, లక్ష్మణ్‌కుమార్‌నూ కొద్దిగంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.9లక్షల నగదు రికవరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. ఐదుగురు నిందితులను చిత్తూరులో జడ్జి ముందు హాజరు పరచగా 14రోజులపాటు రిమాండు విధించారన్నారు. కాగా, గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్‌లో సెల్వంపై రౌడీషీట్‌ ఉంది.

టెంకాయల వ్యాపారమా? దొంగనోట్ల వ్యవహారమా?

తమిళనాడుకు చెందిన మంజునాథ్‌ను టెంకాయల వ్యాపారం కోసం పిలిపించి డబ్బులు కాజేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే, దొంగనోట్ల వ్యవహారమంటూ ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్‌ నగదుకు మూడు నుంచి నాలుగింతలు రెట్టింపుగా దొంగనోట్లు ఇస్తామని పిలిపించినట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారం కోసమే అయితే డంపింగ్‌ యార్డు వద్ద ఆర్థిక లావాదేవీలు నడపడం ఏమిటన్నది పలువురి ప్రశ్న. ఈజీ మనీ కోసం మంజునాథ్‌ను ఆశపెట్టి పిలిపించి.. ప్రణాళిక ప్రకారం పోలీసుల ద్వారా బెదిరించి డబ్బు లాక్కెళ్లారన్న విమర్శలున్నాయి. ఈ కేసులో దొంగల ముఠాతో ఏఎ్‌సఐ లోకనాథం, ఏఆర్‌ కానిస్టేబుల్‌ రవిచంద్రన్‌ కుమ్మక్కవడంతో.. గంగాధరనెల్లూరు పోలీసులు రెండురోజులపాటు మీడియాకు వివరాలు వెల్లడించకుండా గోప్యం పాటించారు. దీనిపై మీడియా ప్రతినిధులు పదే పదే అడిగినా, దాటవేశారు. చివరకు ఆదివారం సాయంత్రం వివరాలు చెప్పడం గమనార్హం.

Updated Date - May 18 , 2026 | 01:03 AM