ఉతికి ‘ఆరే’శారు!
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:14 AM
అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటిల్లో జడ్పీటీసీ స్థానాలను టీడీపీ ఊడ్చేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఆరేసి జడ్పీటీసీల వంతున మొత్తం స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరులో ఆరు స్థానాలను వరుసబెట్టి మొదటిసారిగా ఊచకోత కోసింది.
ఊడ్చేసిన పీలేరు, రాయచోటి నియోజకవర్గాల జడ్పీటీసీ ఫలితాలు
రికార్డుస్థాయిలో గాలివీడులో సుగవాసి మెజారిటీ
కలికిరి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటిల్లో జడ్పీటీసీ స్థానాలను టీడీపీ ఊడ్చేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఆరేసి జడ్పీటీసీల వంతున మొత్తం స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరులో ఆరు స్థానాలను వరుసబెట్టి మొదటిసారిగా ఊచకోత కోసింది. 1995లో జడ్పీటీసీల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి 2021 ఎన్నికల్లో మొత్తం ఆరు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అందుకు ప్రతిగా ఈ ఎన్నికల్లో వైసీపీకి కంగు తినిపించింది. ఆఖరుకు చింతలకు కంచుకోటగా వున్న వాల్మీకిపురం జడ్పీటీసీని కూడా ఈ దఫా టీడీపీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. పీలేరు నియోజకవర్గంలో కలికిరి జడ్పీటీసీగా ఎన్నికయిన కోవూరు షర్మిల అత్యధికంగా 8,832 ఓట్ల మెజారిటీతో ముందు వరుసలో నిలిచారు. పీలేరులో పురుం రెడ్డెమ్మ 5,461 ఓట్లు, కేవీ పల్లెలో రెడ్డిమహేంద్ర రెడ్డి 306, వాల్మీకిపురంలో కె.లక్ష్మిదేవి 1,532, గుర్రంకొండలో ఏజాజ్ అహ్మద్ 3,345, కలకడలో వెంకట్రమణ 5,679 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం నియోజకవర్గంలో టీడీపీ 25,155 ఓట్ల మెజారిటీ సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కిశోర్‌కుమార్ రెడ్డి సాధించిన మెజారిటీకి అదనంగా వెయ్యి ఓట్లు పెరిగాయి. అంతేగాకుండా వైసీపీకి ప్రతిష్టాత్మకమైన వాల్మీకిపురంలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీని అధిగమించింది. ఇక నియోజకవర్గంలోని ఆరు మండల ప్రజా పరిషత్తుల్లో కూడా మొదటిసారిగా టీడీపీ జెండా ఎగురవేయనుంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వరుసబెట్టి అన్ని మండల పరిషత్తులతో పాటు జడ్పీటీసీలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా ఇక్కడ రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకోవడం కూడా విశేషమే. మిగిలిన మూడు జడ్పీటీసీల్లో కూడా టీడీపీ అత్యధిక మెజారిటీలతో ముందు వరుసలో నిలిచాయి. ప్రత్యేకించి గాలివీడులో సుగవాసి ప్రసాద బాబు 29,825 ఓట్ల మెజారిటీతో రికార్డు సృష్టించారు. మిగతా చిన్నమండెం మండలంలో లక్ష్మీప్రసాద్ రెడ్డి 19,728, సంబేపల్లెలో కరుణ 9,995 ఓట్ల మెజారిటీతో ప్రత్యేకంగా నిలిచారు. మొత్తం మీద మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ 1, వైసీపీ 2, తంబళ్ళపల్లెలో టీడీపీ 2, బీజేపీ 1, వైసీపీ 3, పుంగనూరులో టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ కేవలం ఒకే ఒక సదుం జడ్పీటీసీకి పరిమితమయ్యింది. జిల్లాలోని 25 జడ్పీటీసీలకుగానూ వైసీపీ కేవలం 6 స్థానాలకు పరిమితం కాగా కూటమి పార్టీలు మాత్రం 19 జడ్పీటీసీలను చేజిక్కించుకున్నాయి.