Share News

తొలిరోజే తలపడ్డారు

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:23 AM

పంచాయతీ నామినేషన్ల ఘట్టం హింసాత్మకం టీడీపీ, వైసీపీ బాహాబాహీ పలువురికి గాయాలు మొదటి రోజు సర్పంచ్‌లకు 96.. వార్డులకు 89 నామినేషన్లు

తొలిరోజే తలపడ్డారు
శిబ్యాలలో గొడవ పడుతున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు

అన్నమయ్య, నవంబర్‌ 15(ఆంధ్ర జ్యోతి): అన్నమయ్య జిల్లాలో పల్లెపోరు నామినేషన్ల తొలిరోజు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ మద్దతుదారులు పలుచోట్ల బాహాబాహీకి దిగారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. కాగా, మొదటి రోజు సర్పంచ్‌లకు 96, వార్డులకు 89 నామినేషన్లు దాఖలయ్యాయి. రాయచోటి డివిజన్‌లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతలు, దాడుల మధ్య మొదలైంది. రాయచోటి మండలం సిబ్యాల నామినేషన్‌ కేంద్రంలో నామినేషన్‌ సందర్భంగా పెమ్మాడపల్లెకు చెందిన టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లదాడికి పాల్పడ్డాయి. పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెకు చెందిన ఇడగొట్టు భాస్కర్‌ గాయపడ్డారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రాయల్‌ ప్రభుపైన వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. అతనికి రక్తగాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జీ చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు దగ్గరుండి వైసీపీ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. సిబ్యాలలో పోలీసులు తమకు సహకరించలేదని, టీడీపీ వర్గీయులపైనే లాఠీచార్జి చేశారని మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవరం నామినేషన్‌ కేంద్రం వద్ద ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. రామాపురం మండలం హసనాపురం పంచాయతీ టీడీపీ అభ్యర్థి హరినాథరెడ్డి ఇంటిపైన సుమారు 200 మంది వైసీపీ మద్దతుదారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో హరినాథరెడ్డి తండ్రి రాజారెడ్డి తలకు గాయాలయ్యాయి. టీడీపీ నాయకులకు చెందిన కార్లు, బైకులను వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చిట్లూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ బాహాబాహీకి దిగాయి. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జీ చేసి చెదరకొట్టారు. లాఠీఛార్జీలో పలువురు టీడీపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. గాలివీడు మండలం నూలివీడులో టీడీపీ వర్గీయులకు చెందిన కారుపై వైసీపీ వాళ్లు దాడి చేసి అద్దాలు పగులకొట్టారు. తలముడిపిలోనూ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సర్దుబాటు చేశారు. మంత్రి మండిపల్లె పలు నామినేషన్‌ కేంద్రాలను సందర్శించి స్థానిక టీడీపీ నాయకులకు సూచనలు ఇచ్చారు.

ఉద్రిక్త కేంద్రాల్లో ఎస్పీ పర్యటన

ఎస్పీ ధీరజ్‌ రాయచోటి డివిజన్‌లోని పలు నామినేషన్‌ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. రాయచోటి, రామాపురం, గాలివీడు మండలాల్లో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణపడిన నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్‌ కేంద్రాల పరిసరాల్లో, సమీపంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

మొదటి రోజు 96 నామినేషన్లు

రాయచోటి డివిజన్‌లోని ఆరు మండలాల్లో కలిపి 85 సర్పంచ్‌ స్థానాలకు గానూ 96 నామినేషన్లు దాఖలయ్యాయి. 816 వార్డు స్థానాలకు గానూ 89 నామినేషన్లు దాఖలయ్యాయు. ఎక్కువగా టీడీపీ మద్దతుదారులే నామినేషన్లు వేశారు. సంబేపల్లె, రాయచోటి, రామాపురం మండలాల్లో వైసీపీ మద్దతుదారులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన చోట్ల నామినేషన్లు వేయడానికి వైసీపీ మద్దతుదారులు ముందుకు రాలేదు.

Updated Date - Nov 16 , 2026 | 12:23 AM