Share News

ఇసుకను దోచేస్తున్నారు!

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:35 AM

స్టాకు పాయింట్లను అడ్డుగా పెట్టుకుని చెయ్యేరు నదిలో ఇసుకను దోచేస్తున్నారని నదీ పరివాహక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇసుకను దోచేస్తున్నారు!
నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు

రైల్వేకోడూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):స్టాకు పాయింట్లను అడ్డుగా పెట్టుకుని చెయ్యేరు నదిలో ఇసుకను దోచేస్తున్నారని నదీ పరివాహక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం కోమంతరాజపురం, నారాయణనెల్లూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో రెండు ఇసుక స్టాక్‌పాయింట్లను ఓ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ దక్కించుకుంది. అక్టోబరు 31వ తేదీతో టెండరు గడువు ముగిసినా స్టాకు పాయింట్లలో ఇసుక నిల్వ ఉందన్న కారణాన్ని చూపుతూ రెండు దఫాలుగా ఈనెల 31వ తేదీవరకు గడువు పొడిగించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. స్టాకు పాయింట్లలోని ఇసుకను విక్రయించుకోకుండా, పక్కనే ఉన్న చెయ్యేరునది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేసి.. స్టాకు పాయింట్ల మాటున బెంగళూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు వంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని నదీపరివాహక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఈ రెండు స్టాకు పాయింట్ల ఇన్‌చార్జి అధికారి రంగకుమార్‌ను వివరణ కోరగా.. చెయ్యేరు నదిలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగడం లేదన్నారు. అవసరమైతే తాము ఇసుక స్టాకు పాయింట్లను పరిశీలిస్తామని చెప్పారు. కాగా, ఈ రెండు స్టాకు పాయింట్లు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్నాయన్నారు. ఏప్రిల్‌ ఐదో తేదీలోపు ఈ పాయింట్లు తిరుపతి జిల్లాలోకి మారిపోతాయని చెప్పారు.

Updated Date - Mar 31 , 2026 | 01:36 AM