Share News

ప్రమాదాలకు ‘అడ్డంగా’ పోతున్నారు

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:35 AM

దగ్గరగా వెళ్లొచ్చని సర్వీసు రోడ్డునుంచి అడ్డదిడ్డంగా హైవేపైకి వస్తున్న వాహనదారులు

    ప్రమాదాలకు ‘అడ్డంగా’ పోతున్నారు
చెర్లోపల్లె వద్ద సర్వీస్‌ రోడ్డు నుంచి అడ్డంగా హైవేపై వెళుతున్న ద్విచక్ర వాహనదారులు

చిత్తూరు సిటి, ఆంధ్రజ్యోతి: కొందరు ప్రమాదాలకు ‘అడ్డంగా’ పోతుంటే.. మరికొందరు ఎదురెళ్లుతున్నారు. జాతీయ రహదారిపై నిబంధనలను గాలికొదిలి.. ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇలా పెరిగిన రోడ్డు ప్రమాదాలతో కొందరు మృతిచెందితే.. మరికొందరు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. తమ కుటుంబాలకు శోకాన్ని.. కష్టాన్ని మిగులుస్తున్నారు.

జిల్లాలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, తిరుపతి తదితర నగరాలకు వెళ్లే జాతీయ రహదారులున్నాయి. వీటిలో రోజూ వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, అర్దగిరి తదితర ప్రాంతాలకు భక్తులు కూడా ఈ జాతీయ రహదారులపై వెళుతుంటారు. ఇలా నిత్యం రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారుల్లో పలుచోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలా మంది వాహనదారులు, పాదచారులు కోరి మరణాలు తెచ్చుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి సర్వీస్‌ రోడ్లనుంచి జాతీయ రహదారులను కలుపూతూ బండలు.. సిమెంటుతోనూ రోడ్లు వేశారు. దగ్గరగా గమ్యస్థానాలకు వెళ్లొచ్చని స్థానిక వాహనదారులు, పాదచారులు వీటిపై దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇది తరచూ జాతీయ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలకు నిదర్శనం. మరోవైపు కొంతమంది తమ వ్యాపారాల కోసం సర్వీ్‌సరోడ్లపైకి వచ్చేస్తున్నారు. కొన్ని చోట్ల సూచిక బోర్డులు లేకపోవడం, బస్‌స్టా్‌పలపై సరైన పర్యవేక్షణ లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత అధికారులు హడావిడి చేసి.. తర్వాత పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఈ 25 ప్రాంతాలు అత్యంత ప్రమాదకరం

జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 25 బ్లాక్‌ స్పాట్‌లను అధికారులు గుర్తించారు.

ఎన్‌హెచ్‌ 69: ఎంసీఆర్‌, చీలాపల్లి క్రాస్‌, గంగాసాగరం ఆర్‌ఎంఎం ఫ్యాక్టరీ, యాదమరి జంక్షన్‌, వరిగపల్ల జంక్షన్‌, కేజీ సత్రం, మొగిలి ఘాట్‌ రోడ్డు, దొరచెరువు, జగమర్ల క్రాస్‌, దండపల్లి (వైఎ్‌సఆర్‌) జంక్షన్‌, పొన్న మాకులపల్లె క్రాస్‌, కుక్కల దొడ్డి క్రాస్‌.

ఎన్‌హెచ్‌ 42: గొల్లపల్లి క్రాస్‌, దేవదొడ్డి, కొమ్మరమడుగు క్రాస్‌, జవునిపల్లి క్రాస్‌, నాయనపల్లి పెట్రోల్‌ బంక్‌ (గుడిసెట్టపల్లి), విజలాపురం క్రాస్‌, కే.సి హాస్పిటల్‌.

ఎన్‌హెచ్‌ 40: మురుకంబట్టు జంక్షన్‌

ఎన్‌హెచ్‌ 140: తెల్లగుండ్లపల్లె (లక్ష్మీగణపతి డాబా దగ్గర), పి.కొత్తకోట రైల్వే అండర్‌ బ్రిడ్జి

ఎన్‌హెచ్‌ 716: నగరి హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా, కన్నం మిట్ట.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ఇటీవల రవాణాశాఖ, నేషనల్‌ హైవేస్‌, ఆర్‌అండ్‌బీ, పోలీసు, ఆర్టీసీ, ఇతర అధికారులతో కలసి జిల్లాలోని బ్లాక్‌ స్పాట్‌లపై అధ్యయనం చేశాం. నేషనల్‌ హైవే వారికి తగిన సూచనలు చేశాం. గ్రామాలున్న ప్రాంతాల్లో ఎన్‌హెచ్‌ రోడ్లు, సర్వీస్‌ రోడ్ల మధ్య ప్రజలు, జంతువులు రోడ్డు దాటే వీల్లేకుండా ఇనుప డివైడర్లు ఏర్పాటు చేయాలి. కొన్ని ఆర్టీసీ.. ట్రావెల్స్‌ బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు ఎన్‌హెచ్‌లపై ఉన్న కనెక్టివిటీ రోడ్లపైన ప్రయాణికులను దించుతున్నారు. దీనివల్ల ప్రయాణికులు రోడ్డుపై వచ్చే వాహనాలను గమనించక రోడ్డుదాటుతూ ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరోవైపు ఈ వాహనాలను ఆపడంతో.. వెనుక వస్తున్న వాహనదారులు ఢీకొంటున్నారు. సర్వీస్‌ రోడ్డులో వెళ్లి బస్‌స్టా్‌పలోనే ఆపి ప్రయాణికులను దించాలి. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదికలు ఇచ్చాం.

- నిరంజన్‌రెడ్డి, డీటీసీ

Updated Date - Sep 08 , 2026 | 12:35 AM