Share News

సెలవు రోజుల్లో చక్కబెట్టేస్తున్నారు..!

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:40 AM

ప్రభుత్వ భూములు, గుట్టలు, వంకలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. గమనించిన రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారు అడ్డుకోవడంతో ఆక్రమార్కులు వారం, పది రోజులు వాటి జోలికి వెళ్లడం లేదు. సెలవు రోజుల్లో ముఖ్యంగా ఆదివారం అధికారులు ఉండకపోవడంతో పనులు చక్కబెట్టేస్తున్నారు.

సెలవు రోజుల్లో చక్కబెట్టేస్తున్నారు..!
గుర్రంకొండ-వాల్మీకిపురం రోడ్డులో గుట్టపై ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌

యథేచ్ఛగా గుట్టలు, ప్రభుత్వ స్థలాల కబ్జా

స్థానికుల ఫిర్యాదుతో అడ్డుకుంటున్న రెవెన్యూ అధికారులు

ఆదివారం రోజు పనికానిచ్చేస్తున్న అక్రమార్కులు

ప్రభుత్వ భూములు, గుట్టలు, వంకలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. గమనించిన రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారు అడ్డుకోవడంతో ఆక్రమార్కులు వారం, పది రోజులు వాటి జోలికి వెళ్లడం లేదు. సెలవు రోజుల్లో ముఖ్యంగా ఆదివారం అధికారులు ఉండకపోవడంతో పనులు చక్కబెట్టేస్తున్నారు.

గుర్రంకొండ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిట్టిబోయినపల్లె రెవెన్యూ గ్రామంలో పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇది కడప-బెంగుళూరు జాతీయ రహదారి వెంబడి ఉండటంతో ఎక్కువ ధర పలుకుతోంది. చిట్టిబోయినపల్లె సమీపంలో సర్వే నెంబరు 87/8లో 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని గతేడాది మే, జూన్‌లో కబ్జా చేయడానికి అక్రమార్కులు ప్రయత్నించారు. రైతుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రెవెన్యూ అధికారులు భూమిని సర్వే చేసి, బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ చివర ఆక్రమార్కులు సిమెంట్‌ బల్లలతో ప్రహరీ ఏర్పాటు చేస్తుండగా అధికారులు నిలుపుదల చేశారు. ఈ క్రమంలో గత ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమి చుట్టూ సిమెంట్‌ బల్లలతో ప్రహరీని పూర్తి చేశారు.

గుట్ట ఆక్రమణకు వైసీపీ నేత యత్నం

గుర్రంకొండ-వాల్మీకిపురం రోడ్డులోని ఒక గుట్టను వైసీపీ నేత ఆక్రమించుకుని చదును చేస్తుండగా రైతుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్స్‌కవేటర్‌తో గుట్టను చదును చేసి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. కిందిస్థాయి నేతలు, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఆక్రమణలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

భూములను స్వాధీనం చేసుకుంటాం

గుర్రంకొండ, చిట్టిబోయినపల్లెలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

- ఫణికుమార్‌, తహసీల్దార్‌, గుర్రంకొండ

Updated Date - Jun 25 , 2026 | 12:40 AM