Share News

రీ సర్వేలో ఎలాంటి తప్పులు ఉండొద్దు

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:53 AM

భూముల రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

రీ సర్వేలో ఎలాంటి తప్పులు ఉండొద్దు
ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌

నిండ్ర, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్పష్టం చేశారు. సోమవారం నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 97 అర్జీలు అందాయి. వాటిని 14 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిరోజు కలెక్టరేట్‌కు పలు సమస్యలపై ప్రజలు సుమారు 100 వినతులు ఇస్తున్నారని, వాటిని తగ్గించడానికి మండలస్థాయిలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సోమవారం నిండ్ర మండలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మండలాల్లో ఎవరి వద్ద ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయనేది తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి నివేదికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పారదర్శకంగా, పక్షపాతం లేకుండా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకూడదన్నారు. చిన్న స్థాయిలోనే సమస్యలను పరిష్కరించగలిగితే.. అవి పెద్దవి కాకుండా చూడొచ్చన్నారు. భూ సమస్యలను పరిష్కరించడంలో సర్వేయర్లు, వీఆర్వోలు కీలకపాత్ర పోషించాలని ఆదేశించారు. సర్వే చేసినప్పుడు గ్రామసభ నిర్వహించి రీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాల్లో రీ సర్వే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ మాట్లాడుతూ అధికారులు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయి 90శాతం ఉండేలా ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులతో పాటు టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు దశరథవాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:53 AM