Share News

తోతాపురికి ఒకే ధర విధానం ఉండాలి

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:08 AM

మ్యాంగో మార్కెట్‌లో ధరల అసమానతలు లేకుండా చూడాలన్న కలెక్టర్‌

తోతాపురికి ఒకే ధర విధానం ఉండాలి

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు జిల్లాలో తోతాపురి రకం మామిడిని కిలో రూ.7గా ప్రారంభించి కొనసాగిస్తున్నాం. ఇతర ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాంగో మార్కెట్‌లో అసమానతలు తలెత్తాయి. రైతులకు నష్టం కలగకుండా రాష్ట్రాలు, జిల్లాలవారీగా ఒకే విధమైన ధర విధానం అమలుచేసే అంశాన్ని పరిశీలించాలి’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కోరారు. సోమవారం అమరావతి నుంచి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ నాలుగు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో హైబ్రిడ్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చిత్తూరు నుంచి పాల్గొన్న కలెక్టర్‌ సనత్‌కుమార్‌ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోనే 30 వేల మంది మామిడి రైతులు ఉన్నారన్నారు. వీరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరలను మరింత పెంచే అవకాశాలపై చర్చించామన్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఆర్డర్లు ఇచ్చే బహుళ సంస్థలతో కూడా చర్చించి రైతులకు మెరుగైన ధరలు లభించేలా సహకరించాలని కోరామని చెప్పారు. మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో సైతం మామిడి రైతుల సమస్యలను చర్చించగా, కొన్ని యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయన్నారు. ఫ్యాక్టరీల వద్దకు మామిడి లోడ్‌తో వచ్చే ట్రాక్టర్లు, లారీలను క్రమంగా లోనికి పంపుతున్నారని, అక్కడ నిఘా పెంచాలని తహసీల్దార్లను ఆదేశించామని చెప్పారు. జిల్లాలో 31 మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు ఉండగా, వాటిలో 28 ఫ్యాక్టరీలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని, ఇందులో 14 ఫ్యాక్టరీలు మాత్రమే తోతాపురి మామిడి కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. మిగిలిన ఫ్యాక్టరీలు కూడా తోతాపురి రకం కొనుగోలు చేసేలా యాజమాన్యాలను ఒప్పిస్తున్నట్లు వివరించారు.

వచ్చే వారం సీఎం సమక్షంలో సమావేశం

ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వచ్చేవారం మరో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి తెలిపారు. సీఎం స్థాయిలో జరగనున్న సమావేశం అనంతరం తోతాపురి మామిడి కొనుగోలు ధరలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ డీడీ సతీష్‌, ఏడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 01:08 AM