అన్ని గుజ్జు పరిశ్రమల్లో తోతాపురికి ఒకే ధర ఉండాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:41 AM
చిత్తూరు జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమల్లో తోతాపురి రకానికి ఒకే ధరను అమలు చేయాలని మామిడి రైతు జిల్లా సంక్షేమ సంఘం డిమాండు చేసింది.
జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమల్లో తోతాపురి రకానికి ఒకే ధరను అమలు చేయాలని మామిడి రైతు జిల్లా సంక్షేమ సంఘం డిమాండు చేసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పలువురు రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పరిశ్రమల ముందు ధరల పట్టికను ప్రదర్శించాలని డిమాండు చేశారు. ‘టోకెన్లను పారదర్శకంగా ఇవ్వాలి. పరిశ్రమలు, ర్యాంపులకు మధ్య ధర వ్యత్యాసం రూపాయి మాత్రమే ఉండాలి. రైతులకు మంచి ధరను ఇప్పించాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి కాయల లారీలను నియంత్రించాలి’ అని నినదించారు. అనంతరం కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందనాయుడు, హరిబాబు చౌదరి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర రూ.18గా నిర్ణయించాలి
‘జిల్లాలో మామిడి రైతులు, మామిడి సంఘాల ప్రతినిధులతో చర్చించి పెట్టుబడి ఖర్చులను నిర్ణయించాలి. రైతులకు నష్టం రాకుండా తోతాపురి రకానికి కిలో రూ.18గా మద్దతు ధర నిర్ణయించాలి’ అని మామిడి రైతు సంఘం నాయకులు కోరారు. రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు సంజీవరెడ్డి, ఉమాపతి నాయుడు, శ్రీనివాసులు, హేమలత, చెంగల్రాయరెడ్డి, త్యాగరాజులురెడ్డి, మోహన్‌రెడ్డి, దేవయ్య మాట్లాడారు. గతేడాది తోతాపురి కిలో రూ.12 నిర్ణయించారని, ఈ ఏడాది పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.18గా ధర నిర్ణయించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.7ను ఏ గుజ్జు పరిశ్రమ అమలు చేయం లేదన్నారు. గతేడాది పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే రైతులకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి