Share News

ట్రూ డౌనే తప్ప అప్‌ వుండదు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:58 AM

దేశంలోనే తొలిసారిగా విద్యుత్‌ చార్జీలను ట్రూ డౌన్‌ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు.

 ట్రూ డౌనే తప్ప అప్‌ వుండదు
రాచర్లలో సబ్‌స్టేషన్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి రవికుమార్‌తో ఎమ్మెల్యే ఆదిమూలం, శంకర్‌రెడ్డి తదితరులు

విద్యుత్‌ చార్జీలపై మంత్రి రవికుమార్‌

వరదయ్యపాళెం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి):దేశంలోనే తొలిసారిగా విద్యుత్‌ చార్జీలను ట్రూ డౌన్‌ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు.భవిష్యత్తులో ట్రూ డౌన్‌ తప్ప ట్రూ అప్‌ చార్జీలు అనేవి వుండవన్న ఆయన విద్యుత్తు బిల్లులు తగ్గించిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలకు వెళతామని తెలిపారు. సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక వాడ పరిధిలోని రాచర్లలో రూ.125 కోట్లతో నిర్మించిన 220/132/32కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019లో ఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి చేశామని తెలిపారు. రాచర్ల సబ్‌స్టేషన్‌ ద్వారా చుట్టు పక్కలున్న పరిశ్రమలకు ఇక లో ఓల్టేజీ సమస్యలుండవని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలో వాట్‌ చొప్పున పీఎం సూర్యఘర్‌ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. వచ్చే మూడు నెలల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్‌ కనెక్సన్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం సబ్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే ఆదిమూలం, టీడీపీ ఇన్‌చార్జి కూరపాటి శంకర్‌రెడ్డి,ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌, ఎస్‌ఈ చంద్రశేఖరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ పరిధిలోని పారిశ్రామిక వాడలో నిర్మించిన 133/132కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితో కలిసి మంత్రి రవికుమార్‌ ప్రారంభించారు.తూకివాకం పారిశ్రామిక వాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక లోడు అవసరాన్ని గుర్తించి ఈ సబ్‌ స్టేషన్‌ను రూ 76.89కోట్లతో నిర్మించామని తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 12:58 AM