ఆ సీఐ అరాచకాలకు హద్దూపద్దు లేదు
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:27 AM
తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికలు ఈనెల 26న జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ పట్ల అభిమానం ఉన్న రాయచోటికి చెందిన కొందరు యువకులు పోలింగ్ సరళిని గమనించేందుకు బి.కొత్తకోటకు వచ్చారు.
- జిల్లాస్థాయి అధికారులనూ లెక్కచేయని వైనం
- వైసీపీతో లోపాయికారీ వ్యవహారాలు
అన్నమయ్య, నవంబర్ 29(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికలు ఈనెల 26న జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ పట్ల అభిమానం ఉన్న రాయచోటికి చెందిన కొందరు యువకులు పోలింగ్ సరళిని గమనించేందుకు బి.కొత్తకోటకు వచ్చారు. వాళ్లు ఏ పోలింగ్ కేంద్రం సమీపానికీ వెళ్లలేదు. పట్టణంలో అక్కడక్కడ నిల్చుని స్థానికులతో మాట్లాడుతూ పోలింగ్ ఎలా జరుగుతోంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది..? అంటూ అడుగుతూ మాట్లాడుకుంటున్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సుమారు 50మందికి పైగా వైసీపీకి చెందిన వాళ్లు ఒక్కసారిగా ఈ యువకులపై దాడి చేసి ముగ్గురిని తమ వాహనాల్లో తీసుకెళ్లిపోయారు. యువకులతో పాటు వచ్చిన మరో వ్యక్తి తప్పించుకుని ఈ విషయాన్ని వెంటనే టీడీపీ ముఖ్య నాయకులకు ఫోన్ చేసి చెప్పారు. వారు వెంటనే ఎన్నికల విధుల్లో ఉన్న ఓ సీఐకి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించలేదు. తమతో పాటు తీసుకెళ్లిన యువకులను కొడుతూ.. బెదిరిస్తూ.. వైసీపీ నాయకులే ఓ వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఆ యువకులను వాహనాల్లోనే ఉంచుకుని కొడుతూ సుమారు రెండు గంటల పాటు పట్టణంలో తిప్పారు. తర్వాత ముగ్గురిలో ఒకడిని వదిలిపెట్టారు. మరో ఇద్దరిని తీసుకెళ్లి నిర్బంధించారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నాయకులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఓ సీఐ కొంతమంది పోలీసులతో ఎట్టకేలకు వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి ఇల్లు, మరికొన్ని చోట్ల వెతికి ఆ యువకుల ఆచూకీ దొరకలేదంటూ చేతులు దులుపుకున్నారు. పోలింగ్ ముగిసి రాత్రి 9 గంటలైనా వైసీపీ వాళ్లు కిడ్నాప్ చేసిన ఆ యువకుల గురించి పోలీసులు పట్టించుకోలేదు. ఆ యువకుల బంధువులు ఆందోళనతో ఓ జిల్లా స్థాయి టీడీపీ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన వైసీపీ ముఖ్య నాయకులకు ఫోన్ చేయడంతో రాత్రి 9.30 గంటల సమయంలో తీవ్రంగా గాయపడి కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకులను ఆ నాయకుడి అనుచరులకు అప్పగించారు. యువకులను కిడ్నాప్ చేసిన వైసీపీ ముఠా వాళ్లను చాలా తీవ్రంగా కొట్టింది. రక్తగాయాలు ఎక్కువ కావడంతో బయటకు వదిలితే కేసు పెడతారేమో అనే భయంతో స్థానికంగా ముఖ్యమైన ఓ వైసీపీ నాయకుడి గెస్ట్‌హౌస్‌లో ఉంచారు. అయితే ఈ గెస్ట్‌హౌస్‌లో వెతకడానికి వెళ్లిన పోలీసులు తీవ్రంగా గాయపడి నిర్బంధించబడిన ఆ యువకులను గమనించారు. దీంతో కంగారుపడ్డ వైసీపీ నాయకులు ఆ సీఐతో కాళ్ల బేరానికి వచ్చారు. వారి మధ్య ఏం ఒప్పందం జరిగిందో? బేరం ఎంత తూకం తూగిందో కానీ తీవ్ర రక్తగాయాలతో ఉన్న ఆ యువకులను విడిపించకుండా పోలీసులు అక్కడి నుంచి వచ్చేశారు. తాము ఎంత వెతికినా దొరకలేదంటూ టీడీపీ నాయకులకు చెప్పారు. వైసీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న ఆ సీఐ గురించి ఇప్పుడు జిల్లా పోలీసు వర్గాల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది.
ఆ సీఐ భాగోతం చాలా పెద్దదే
బహిరంగంగా వైసీపీకి కొమ్ముకాసిన ఆ సీఐ గురించి ఆరా తీస్తే సొంత శాఖలోనే ఆయన వ్యవహారశైలిపై పెదవి విరుస్తున్నారు. ఒంటిమీద యూనిఫామ్ ఉందనే స్పృహ లేకుండా ప్రవరిస్తున్నాడంటున్నారు. జిల్లాలోని ఓ ముఖ్య ప్రాంతంలో ఈయన గతంలో పనిచేసిన చోట విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా డబ్బును బట్టే న్యాయాన్యాయాలను చూసేవాడని ఆరోపణలున్నాయి. అక్కడ బాధ్యతలు తీసుకున్నది మొదలు బదిలీ అయ్యేంత వరకు వివాదాస్పదంగానే వ్యవహరించాడు. ఆయన పోలీసుస్టేషన్ పరిధిలో ఓ రైతును భూవివాదంలో ప్రత్యర్దులు కొట్టి చంపి పొలం వద్ద ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇది హత్య అని మొత్తుకున్నా పోలీసులు మాత్రం ఆత్మహత్యగానే కేసు నమోదు చేశారు. దీని వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. మృతుడి బంధువులు సీఐకి వ్యతిరేకంగా పోలీస్‌స్టేషన్, ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నా కూడా నిర్వహించారు. ట్రాఫిక్‌లో జనం అందరూ చూస్తుండగా ఓ లారీ డ్రైవర్‌ను చితకబాది కాలు విరగ్గొట్టాడు. దీంతో లారీ అసోసియేషన్ నాయకులు, డ్రైవర్లు సీఐకి వ్యతిరేకంగా ధర్నా చేసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరో సంఘటనలో ఓ యువకుడిపై అకారణంగా దాడి చేసిన సీఐ బూటుకాలితో తన్నడంతో ఆగ్రహించిన అతడి గ్రామస్తులు సుమారు రెండు గంటల పాటు ప్రఽధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని సీఐ పనితీరు గురించి ప్రశ్నించారు. ‘నేను ఇంతే.. ఏం చేసుకుంటావో చేసుకో.. చేతనైతే. ట్రాన్స్‌ఫర్ చేయించుకో..’ అంటూ అందరి ముందరా ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే వర్గీయులకు వ్యతిరేకంగా పలు కేసులు నమోదు చేశాడు. జిల్లాస్థాయి అధికారులనూ ఈ సీఐ లెక్క చేసేవాడు కాదు. స్టేషన్‌లో పంచాయితీలు చేసి పెద్దమొత్తంలో మామూళ్లు వసూలు చేసేవాడనే ఆరోపణలున్నాయి. ఈ సీఐ బావమరిది అమరావతిలో ఓ ముఖ్య నేత దగ్గర ఉండడం వల్లే చెలరేగిపోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పోలీసుశాఖలో ఉన్నతాధికారులు ఈయనకు వెన్నుదన్నుగా ఉన్నారనే ఆరోపణలూ ఉన్నాయి.