‘సీమ’లో మహిళలు తక్కువ
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:55 AM
కోస్తా కంటే రాయలసీమ జిల్లాల్లో పురుషుల కంటే మహిళల శాతం తక్కువగా ఉంది. మహిళల రేటు తగ్గడానికి భ్రూణ హత్యలే కారణం. దీనిపై సమాజంలో మరింత అవగాహణ అవసరం’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
మహిళా దినోత్సవంలో కలెక్టర్ సుమిత్‌కుమార్
చిత్తూరు అర్బన్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ‘కోస్తా కంటే రాయలసీమ జిల్లాల్లో పురుషుల కంటే మహిళల శాతం తక్కువగా ఉంది. మహిళల రేటు తగ్గడానికి భ్రూణ హత్యలే కారణం. దీనిపై సమాజంలో మరింత అవగాహణ అవసరం’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 12 నుంచి 15 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఏడాది జిల్లాలో 25వేల కాన్పులు జరుగుతుండగా వాటిలో 2500 కాన్పులు 18 సంవత్సరాల్లోపు బాలికలే ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. టీనేజ్‌లో గర్భధారణ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. డీఆర్‌డీఏ, మెప్మా, మహిళా సంఘాలు సంయుక్తంగా బాల్య వివాహాలు, గర్భధారణలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మహిళా సంఘాలదేనన్నారు. తన తల్లి చూపిన ధైర్యం, సహకారం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గుర్తుచేసుకున్నారు. ఈ ప్రపంచమంతా మహిళలపై ఆధారపడి, మహిళల వల్ల అభివృద్ధి చెందుతోందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ అన్నారు. మహిళలు చదువుకున్నా ఇంట్లో ఉంటే చాలనే రోజుల నుంచి ప్రస్తుతం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారని మేయర్ అముద పేర్కొన్నారు. మహిళలు బహుగుణ ప్రతిభ కలిగిన వారని, ఎలాంటి సమస్యనైనా ఆలోచించి పరిష్కరిస్తారని చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత చెప్పారు. అనంతరం డీఆర్‌డీఏ ద్వారా 205 మహిళా సంఘాలకు పీఎం- అజయ్, ఎస్పీ కార్పొరేషన్ ద్వారా రూ.2.94కోట్ల మెగా చెక్కును అందించారు. యాదమరి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రజియాకు రూ.8 లక్షల ట్రాక్టర్‌ను అందించారు. చివరగా డీఆర్‌డీఏ, మెప్మా అధికారులను, అంగన్వాడీ సూపర్‌వైజర్లను, ఉత్తమ ఎంట్రప్రెన్యూర్ లను కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, వివిధ విభాగాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.