చిత్తూరు జిల్లాలో 15,79,996 మంది ఓటర్లు
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:49 AM
జిల్లాలో ఇప్పటివరకు 15,79,996 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమావేశమయ్యారు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటివరకు 15,79,996 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం బోగస్, మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు చెప్పారు. బీఎల్వోలు చేపట్టే ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బీఎల్‌ఏ ద్వారా పరిశీలించవచ్చన్నారు. జిల్లాలో ఏడు రోజుల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో వున్న ఫార్మ్స్ చాలా తక్కువగా ఉన్నాయని, కొత్తగా అందే దరఖాస్తులను ఏ రోజుకారోజు ఈఆర్వో లాగిన్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. నగరిలో 39, చిత్తూరులో 32 ఫార్మ్స్ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఓటర్ల జాబితాలో అనవసర తొలగింపులు జరగకుండా చూడడం, మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సురేంద్ర కుమార్ (టీడీపీ), అట్లూరి శ్రీనివాసులు (బీజేపీ), ఉదయ్ కుమార్ రెడ్డి (వైసీపీ), పరదేశి (కాంగ్రెస్), గంగరాజు (సీపీఎం), ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజేంద్ర, ఎన్నికల విభాగ సిబ్బంది మనోజ్ కుమార్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు.