Share News

అప్పుడూ ఇప్పుడూ.. వాళ్లే

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:48 AM

అధికార పార్టీలు మారొచ్చు. కానీ, ఇసుక తవ్వి అక్రమంగా తరలించే వాళ్లు మాత్రం మారరు.

అప్పుడూ ఇప్పుడూ.. వాళ్లే
కౌండిన్య నదిలో నీటి నుంచి ఇసుకను ఎక్స్‌కవేటర్‌తో తోడి కుప్పగా

అధికార పార్టీలు మారొచ్చు. కానీ, ఇసుక తవ్వి అక్రమంగా తరలించే వాళ్లు మాత్రం మారరు. కాకుంటే, పార్టీల జెండాలు మారస్తారంతే. ఇలా కౌండిన్య నదిలో ఇంత దూరం నీది.. ఆ ప్రాంతం నాది.. అంటూ భాగాలేసుకుని మరీ తవ్వేస్తున్నారు.

- పలమనేరు, ఆంధ్రజ్యోతి

పలమనేరు, గంగవరం మండలాల్లో ప్రవహిస్తున్న కౌండిన్య నదిలో ఇసుక స్మగ్లింగ్‌ ఆగడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. తమ కార్యాలయాలకు కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా రెవెన్యూ అధికారులు.. ఇంకొంత దూరంలో పోలీసులు, భూగర్భ జలవనరుల శాఖ అధికారి కార్యాలయమున్నా పట్టించుకోవడం లేదు. పలమనేరు పట్టణానికి తాగునీటి సరఫరా కోసం ఈ నదిలో బోర్లు వేసి పంప్‌ హౌస్‌ నిర్మించారు. ఈ పంప్‌ హౌస్‌ సమీపంలో చెక్‌డ్యామ్‌ ఉంది. ఇందులో నీటి నిల్వతో వేసవిలో సమస్య తలెత్తేది కాదు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలమనేరు మున్సిపాలిటీలోని ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రతిరోజు కౌండిన్య నదిలో నీళ్లున్నా ఎక్సవేటర్ల సాయంతో ఇసుకను తోడి ట్రాక్టర్లలో నింపి అక్రమ రవాణా చేస్తూ వచ్చారు. దీని ప్రభావం భూగర్భ జలాలపైనా పడింది. అప్పట్లో ఒక ట్రాక్టరు ఇసుక రూ.1500 ధర ఉండగా.. వీరి వల్ల వీరు 3500 నుంచి రూ.4 వేలకు పెంచేశారు. అయినా, గృహ నిర్మాణదారులు గత్యంతరం లేక వీరి వద్దే ఇసుక కొనాల్సి వచ్చింది. కొందరు సంపన్నులేమో చిత్తూరు సమీపంనుంచి అక్కడి పెద్ద ఇసుక స్మగ్లర్‌ వద్ద టిప్పర్లలో ఇసుకను రూ.24వేలనుంచి రూ. 27 వేల వరకు కొని తీసుకొచ్చారు. గంగవరం మండలంలోని నల్లగుట్లపల్లి, జీడిమాకులపల్లి, కొంగోళ్లపల్లి, చెన్నారెడ్డిపల్లి గ్రామాల్లో కొందరు ఇసుక అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టారు. వీళ్లూ కౌండిన్య నదిలో ఇసుకను తరలించారు. ఆయా అధికారులకు మామూళ్లు ఇవ్వడంతోనే పట్టించుకునే వారు కాదన్న ఆరోపణలు వచ్చాయి. ఇక, ఇసుక స్మగ్లర్లు ఒకరికొకరు పోటీ పడకుండా కౌండిన్య నదిని కొలతలు వేసుకుని పంచుకున్నారు. ఆ ప్రాంతాల్లోనే వారు ఇసుకను తరలించారు.

మూడేళ్ల కిందట టీడీపీ నేతలు పట్టుకున్నా..

పంపుహౌస్‌ సమీపంలో కొందరు కౌన్సిలర్లు ఇసుక తవ్వుతుంటే మూడేళ్ల కిందట టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండటంతో వీరి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. ఇసుక ట్రాక్టర్లను పట్టుకునే అధికారం లేదని మీకు లేదని ఎదురు ప్రశ్నించారు. మీమీదే కేసులు పెడతామని బెదిరించారు. ఇక, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఇసుక స్మగ్లర్లలో కొందరు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నీళ్లలో నుంచి ఇసుకను తవ్వుతున్నారు.

దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లు

ఇసుక తవ్వేస్తుండటంతో కౌండిన్య నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు దెబ్బతింటున్నాయి. అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోక పోవడంతో కౌండిన్య పరివాహక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇన్నాళ్లుగా ఇసుక అక్రమ రవాణాపై కథనాలొస్తే ఒకట్రెండు ట్రాక్టర్లను పట్టుకుని నామమాత్రంగా కేసులు పెట్టేవారు. ఇసుక స్మగ్లర్లపై కాకుండా ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:48 AM