Share News

మహిళ పేరు కనబడితేచాలు హాయ్‌ అంటూ వల

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:45 AM

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాల్లో మహిళ పేరు కనబడితేచాలు... హాయ్‌ అంటూ వల వేస్తాడు. రిప్లై వచ్చిందంటే ఇక అల్లుకు పోతాడు. నెమ్మదిగా మాటల్లో దించి... పరిచయం పెంచి... చివరకు ఆ పరిచయాన్ని హోటల్‌ రూమ్‌ వరకు లాగేస్తాడు. లేదంటే... న్యూడ్‌ వీడియో కాల్‌గా మార్చేస్తాడు.

మహిళ పేరు కనబడితేచాలు హాయ్‌ అంటూ వల

తిరుపతి(నేరవిభాగం), జనవరి 27(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాల్లో మహిళ పేరు కనబడితేచాలు... హాయ్‌ అంటూ వల వేస్తాడు. రిప్లై వచ్చిందంటే ఇక అల్లుకు పోతాడు. నెమ్మదిగా మాటల్లో దించి... పరిచయం పెంచి... చివరకు ఆ పరిచయాన్ని హోటల్‌ రూమ్‌ వరకు లాగేస్తాడు. లేదంటే... న్యూడ్‌ వీడియో కాల్‌గా మార్చేస్తాడు. తిరుపతిలోనూ ఇలాగే చేసి చివరకు కటకటాల పాలయ్యాడు కడప జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగు విద్యార్థి. పోలీసుల కథనం మేరకు....కడప జిల్లా బద్వేలుకు చెందిన వీర యశ్వంత్‌ (21) చిత్తూరులో బీటెక్‌ చదువుతున్నాడు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుపతి రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ పందొమ్మిదేళ్ల యువతికి హాయ్‌ అంటూ వల వేశాడు. మాయ మాటలతో ఆమెను మభ్యపెడుతూ పరిచయం పెంచుకున్నాడు. మాట్లాడుదాం రమ్మంటూ ఒప్పించి తిరుపతికి రప్పించాడు. ప్రణాళిక ప్రకారం ముందుగానే తీసుకున్న ఓ హోటల్‌ గదికి ఆమెను తీసుకుకెళ్లి అత్యాచారం చేశాడు. మానసికంగా కుంగిపోయిన యువతి నిర్వేదంగా మారింది. ఇది గమనించిన తల్లి తరచి తరచి అడగ్గా ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. ఈనెల 23న జరిగిన ఈ అత్యాచార ఘటనపై అలిపిరి పోలీసులు 24న కేసు నమోదు చేశారు. నిందితుడికోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో తిరుపతి రామచంద్ర పుష్కరిణి సమీపంలో వీర యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అలిపిరి సీఐ రామకిషోర్‌ వెల్లడించారు. నిందితుడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అనేక హాయ్‌ వలలతోపాటు న్యూడ్‌ వీడియో కాల్‌ రికార్డింగులను చూసి అవాక్కయారు.వీర యశ్వంత్‌ను రిమాండ్‌కు తరలించారు.సోషల్‌ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి మోసాలకు, వేధింపులకు గురి కావాల్సివస్తుందని అలిపిరి సీఐ రామకిషోర్‌ హెచ్చరించారు.

Updated Date - Jan 28 , 2026 | 01:45 AM