Share News

ఊరంతా జాతర

ABN , Publish Date - May 13 , 2026 | 12:17 AM

ఊరంతా జాతర చేసుకుంది. అమ్మలగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లింది. అంబళ్లు పోసి తాపం తీర్చింది.

 ఊరంతా జాతర

ఊరంతా జాతర చేసుకుంది. అమ్మలగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లింది. అంబళ్లు పోసి తాపం తీర్చింది. కోర్కెలు తీర్చే కొంగు బంగారాన్ని కళ్లకద్దుకుని భక్తి పారవశ్యంతో చిందేసింది.

తిరుపతి సిటీ, మే 12 (ఆంధ్రజ్యోతి) : తిరుపతిలో మంగళవారం గంగజాతరను ఘనంగా జరుపుకున్నారు. చాటింపు అనంతరం వివిధ వేషాలలో మునిగితేలిన గంగమ్మకు సోమవారం అర్ధరాత్రి తర్వాత విశిష్ట అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. సర్వాలంకారశోభితమైన గంగమ్మకు వజ్రకిరీటాన్ని, బంగారు కవచాలను అలంకరించి దర్శనానికి అనుమతించారు.పొర్లు దండాలు పెట్టుకుంటూ కొందరు, వేషాలు వేసుకుని మరికొందరు అమ్మవారిని దర్శించుకున్నారు.పురుషులు పలురకాల వేషధారణల్లో, మహిళలు కొందరు వేపాకు చీరలు కట్టుకుని అమ్మవారి ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోనే కాకుండా ఆమె సోదరీమణులైన టీపీ ఏరియాలోని తాళ్లపాక పెదగంగమ్మ, చింతల చేనులోని ముత్యాలమ్మ, దాసరిమఠంలోని మాతమ్మ, పల్లెవీధిలోని వేశాలమ్మ, చింతకాయవీధిలో కరిమాను గంగమ్మలతో పాటు నగరంలో వున్న నడివీధి గంగమ్మ ఆలయాలలో కూడా జాతర సంబరాలు ఘనంగా జరిగాయి.భక్తులు పలు పౌరాణిక, జానపద వేషాలు ధరించి అమ్మవార్లను దర్శించుకున్నారు.

మెరిసిన వజ్రకిరీటం, బంగారు ముఖ కవచం

వారంరోజుల పాటు జరిగే జాతరలో చాటింపు రోజు తప్ప తక్కిన రోజుల్లో అలంకరించని బంగారు ముఖ కవచం, వజ్రకిరీటంతో పాటు అమ్మవారి హస్తాలు, పాదాలు కూడా మంగళవారం గంగమ్మకు అలంకరించారు.అమ్మచల్లని చూపుకోసం భక్తిప్రపత్తులతో భక్తులు వేడుకున్నారు. అభిషేకానంతర దర్శనం మొదలుకొని నిర్విరామంగా గంగమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మకు పొంగళ్లు.. భక్తులకు అంబళ్లు

గంగ జాతరంటేనే పొంగళ్లు పెట్టడం...అంబళ్లు పోయడం ప్రధానం. ఇందులో భాగంగానే మంగళవారం వేకువజామునుంచే పొంగళ్లకు కావలసిన వస్తువులను బుట్టలో పెట్టుకుని ఆలయ ప్రాంగణం వద్దకు మహిళలు చేరుకున్నారు.కూరగాయల మార్కెట్‌లో ఆలయ అధికారులు కేటాయించిన స్థలంలో పొంగళ్లు పొంగించి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి నైవేద్యం సమర్చించారు.ఇంటినుంచి తెచ్చిన అంబళ్లను భక్తులను అందజేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు , కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకోగా ఆలయ ఛైర్మన్‌ నైనారు మహేష్‌ యాదవ్‌, ఈవో జయకుమార్‌ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నేడు విశ్వరూప దర్శనం

జాతరలో భక్తులు ప్రధానంగా భావించే అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. పేరంటాల వేషధారులు పంబల వాయిద్యాలతో చాటు మండపం వద్దకు వెళ్లిన తరువాత బేరిశెట్టి ఇంటికి వెళ్లి అక్కడనుంచి మరికొన్ని చోట్లకు వెళ్లి పూజలందుకుంటారు. అక్కడినుండి బుధవారం వేకువజామున చిన గంగమ్మ చెంప నరికి ఆ తరువాత పెద గంగమ్మ చెంపను నరకడంతో జాతర సంబరం ముగియనుంది.

Updated Date - May 13 , 2026 | 12:17 AM