కమనీయం.. ఆది దంపతుల కల్యాణం
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:46 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహా శివరాత్రి వార్షికోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కల్యాణోత్సవం బుధవారం కమనీయంగా నిర్వహించారు.
తరలివచ్చిన భక్తులు
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహా శివరాత్రి వార్షికోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల కల్యాణోత్సవం బుధవారం కమనీయంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. పూజలయ్యాక స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై అధిష్ఠింపజేశారు. మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కళాకారుల ఆటలు, పాటల మధ్య ఆదిదంపతులు పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. మొదట పరమేశ్వరుడు రాగా, మధ్యలో పార్వతీదేవి అలకబూనారు. చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం నిర్వహించి అమ్మవారి అలక తీర్చాక పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. బుధవారం తెల్లవారు జామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో అమ్మవారికి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించి, కల్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో నగరివీధి, నెహ్రూవీధి కిక్కిరిశాయి. ఇదే శుభ ఘడియలో 59 జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు.
శాస్త్రోక్తంగా సభాపతి కల్యాణం
బుధవారం రాత్రి సభాపతి కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కల్యాణోత్సవాన్ని ముక్కంటి ఆలయ ప్రాంగణంలో అర్చకులు నిర్వహించారు. అనంతరం శివగామి సుందరి సమేత నటరాజస్వామిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాల్లో ముక్కంటి ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు కైలాసగిరి ప్రదక్షిణ
గురువారం కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. శివపార్వతుల కల్యాణానికి విచ్చేసిన సకల దేవతాగణాలు, మునులు, రుషులకు వీడ్కోలు పలికేందుకు స్వామి అమ్మవార్లు 21 కిలోమీటర్ల మేర ప్రదక్షిణకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాత్రి రాజగోపురం వద్ద నుంచి స్వామి వారు అశ్వ వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై పురవీధుల్లో ఊరేగనున్నారు. ఈ రాత్రినే రుషిరాత్రి అని కూడా అంటారు.
ట్రాఫిక్ ఆంక్షలిలా..
గిరిప్రదక్షిణ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. భక్తులకు అన్నదానాలు, వితరణలు చేసే వాహనాలను మాత్రమే ఈ ఏడాది గిరి ప్రదక్షిణ మార్గంలో అనుమతిస్తారు. ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలను మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే గిరిప్రదక్షిణ మార్గంలోకి అనుమతించేలా ఆంక్షలు విధించారు.