Share News

ఓటుకు ‘పల్లె’ కదిలింది

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:52 AM

ఓటేయడానికి గ్రామీణ ఓటర్లు కదిలారు. యువత నుంచి కదల్లేని వృద్ధుల వరకు ఓటేసేందుకు చొరవ చూపారు

ఓటుకు ‘పల్లె’ కదిలింది
గుడిపాల మండలం 190 రామాపురంలో ఓటు వేయడానికి కిక్కిరిసిన ఓటర్లు

చిత్తూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఓటేయడానికి గ్రామీణ ఓటర్లు కదిలారు. యువత నుంచి కదల్లేని వృద్ధుల వరకు ఓటేసేందుకు చొరవ చూపారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల కంటే ఇప్పుడు గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. దీంతో 27 మండలాల్లో 9,46,426 మంది ఓటర్లకుగానూ 7,22,159 మంది (76.30 శాతం) ఓటేశారు. మిగిలిన 2.24 లక్షల మంది (23.7శాతం) ఓటుకు దూరంగా ఉన్నారు. దాదాపు ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు ఓటేయలేదన్న మాట. కాగా, 27 జడ్పీటీసీలకు మూడు ఏకగ్రీవం కావడంతో 24కు.. 370 ఎంపీటీసీ స్థానాల్లో 70 ఏకగ్రీవం కాగా 300 కు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకూ ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఉంటే పోలింగ్‌ అధికారులు స్లిప్పులు పంపిణీ చేసి ఓటు వేయించారు. జీడీనెల్లూరు, పెద్దపంజాణి వంటి మండలాల్లో సమయం దాటినా క్యూలలో ఉన్న వారితో ఓట్లు వేయించారు. చెదురు మదురు ఘటనలు మినహా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

మహిళలే ఎక్కువ

జిల్లాలో 468082 మంది పురుష ఓటర్లకుగాను 357583 మంది.. 478320 మంది మహిళా ఓటర్లకుగానూ 364570 మంది ఓట్లు వేశారు. పురుషుల కంటే మహిళలు 6987 మంది ఎక్కువగా ఓటు వేశారు.

పోలింగ్‌లో టాప్‌ 5 మండలాలు

మండలాలవారీగా పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే బైరెడ్డిపల్లె 82.50 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత గుడుపల్లె 80.75, శాంతిపురం 80.50, పలమనేరు 80.47, పెనుమూరు 80.12 శాతంతో నిలిచాయి. జిల్లా సగటు 76.30 శాతం కంటే 11 మండలాల్లో అధిక పోలింగ్‌ నమోదైంది.

అత్యల్ప పోలింగ్‌ ఇక్కడే

67శాతం పోలింగ్‌తో పూతలపట్టు మండలం చివరి స్థానంలో నిలిచింది. ఇక, రామకుప్పంలో 69.27, పులిచెర్లలో 69.52, ఐరాలలో 71.27, రొంపిచెర్లలో 71.63 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధిక పోలింగ్‌ జరిగిన బైరెడ్డిపల్లెకి, అత్యల్పంగా ఉన్న పూతలపట్టుకు మధ్య 15.50 శాతం వ్యత్యాసం ఉంది.

ఇక, ఫలితాలపై ఉత్కంఠ

24 జడ్పీటీసీ, 300 ఎంపీటీసీ స్థానాల ఓట్లను శనివారం లెక్కించనున్నారు. కూటమికి సంబంధించి 24 జడ్పీటీసీ స్థానాల్లో రెండింటిని జనసేనకు కేటాయించారు. కొన్ని మండలాల్లో వైసీపీ కూడా గట్టి పోటీనిచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు మండలాలు మినహా కూటమి అభ్యర్థులకు మంచి మెజారిటీ రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యాదమరి, పూతలపట్టు, బంగారుపాళ్యం మండలాల్లో జడ్పీటీసీ.. మరికొన్ని మండలాల్లో కొన్ని ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మొత్తం.. పోలైన ఓట్లలో తేడా ఉంటుంది.

అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు

ఫ శాంతిపురం మండలం కడపల్లెలో పోలింగ్‌ కేంద్రంలోకి వైసీపీ శ్రేణులు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నడిమూరు పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పళణిపై వైసీపీ కార్యకర్త జయకుమార్‌ దాడి చేశారు.

ఫ పాలసముద్రం మండలం బలిజకండ్రిగ పోలింగ్‌ కేంద్రానికి సాయంత్రం 5 గంటల తర్వాత ఎమ్మెల్యే థామస్‌ వచ్చారు. రిగ్గింగ్‌ చేయడానికి వచ్చావా అంటూ అక్కడే ఉన్న వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి నందిని భర్త షణ్ముగం ఎమ్మెల్యేను ఏకవచనంతో అరవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను రేయ్‌ అంటావా అంటూ టీడీపీ శ్రేణులు అతడిపై దాడి చేశాయి.

ఫ చిత్తూరు రూరల్‌ మండలం దిగువమాసాపల్లె కేంద్రంలో టీడీపీ రెబల్‌ ఎంపీటీసీ అభ్యర్థి జగదీశ్వర్‌నాయుడు అనుచరుడు కుమార్‌పై చిత్తూరుకు చెందిన అల్లరి మూకలు దాడి చేశాయి. దీంతో జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు ఈ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఫ తవణంపల్లె మండలం మైనగుండ్లపల్లెలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నాయి. గతంలో కె.పట్నం ఎంపీటీసీగా నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థి సురే్‌షపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. దీంతో గురువారం టీడీపీ శ్రేణులు మైనగుండ్లపల్లె కేంద్రానికి వెళ్లి తిరిగొస్తుండగా, అడ్డుకుని దాడి చేశారు. టీడీపీ నేత గోపిపై సురేష్‌ కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఇరువర్గాల్లోని పలువురు గాయపడగా.. కొన్ని వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇద్దర్నీ చెదరగొట్టి తరిమేశారు.

ఫ గుడిపాల మండలం బొమ్మసముద్రం కేంద్రంలో బీజేపీ అభ్యర్థి సాయిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ బీజేపీ శ్రేణులు కాసేపు ధర్నా చేయగా, టీడీపీ పైస్థాయి నాయకులు సర్దిచెప్పి రాజీ చేశారు. ఆ తర్వాత కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. కొత్తపల్లె, కట్టకిందపల్లె కేంద్రాల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. పానాటూరు పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నేత కిశోర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పసుమంద, 197 రామాపురం ప్రాంతాల్లో వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. టీడీపీ నాయకులు కఠారి హేమలత, సీఆర్‌ రాజన్‌, కాజూరు బాలాజీ తదితరులు మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు.

Updated Date - Nov 06 , 2026 | 12:52 AM