కట్టుకున్నోడే కాలయముడయ్యాడు
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:27 AM
కోటపోలూరులో మహిళ దారుణ హత్య
సూళ్లూరుపేట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): భార్యకు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి రాత్రంతా చిత్రహింసలు పెట్టి హతమార్చిన ఘటన బుధవారం సూళ్లూరుపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.... కోటపోలూరు పడమటి దళితవాడకు చెందిన పనబాక శ్రీనివాసులుతో తడ మండలం కారిజాతకు చెందిన సంధ్య(28)తో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి తిరుమల, చంద్రిక అనే పిల్లలున్నారు. ఇటీవల శ్రీనివాసులు మద్యం, గంజాయికి బానిసవడమే కాకుండా భార్యపై అనుమానంతో తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో విసిగిపోయిన సంధ్య పిల్లలను తీసుకుని పుట్టింటికెళ్లిపోయింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపఽథ్యంలో మంగళవారం కుమారుడు తిరుమలను వెంటబెట్టుకుని కోటపోలూరుకు వెళ్లి అక్కడ జడ్పీ హైస్కూల్‌లో చేర్పించింది. ఇదంతా గమనిస్తున్న శ్రీనివాసులు భార్య వద్దకు చేరుకుని ఆమెకు మాయమాటలు చెప్పి తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం మోటారు సైకిల్‌పై పొలం వద్దకు తీసుకెళ్లాడు. పుచ్చాకాలువ, రైల్వేట్రాక్ అంచునే ఉన్న దారిలో ఊరికి దూరంగా పొలాల వద్దకు తీసుకెళ్లి రాత్రంతా హింసించి హత్య చేశాడు. బుధవారం వేకువజామున చనిపోయిన భార్యను మోటారు సైకిల్‌పై మూటకట్టి పెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు. గమనించిన చుట్టుపక్కలవారు భయంతో హడలిపోయారు. సమాచారం తెలుసుకున్న సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కోటపోలూరుకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సంధ్య కళ్లు, గొంతుతో పాటు శరీరంపై అక్కడక్కడా కత్తితో పొడిచినట్లు గాట్లున్నాయి. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాఽథలైన పిల్లలు
తల్లి కాటికి.. తండ్రి జైలుకు వెళ్లడంతో వారిద్దరు పిల్లలు 7వ తరగతి చదివే తిరుమల, 5వ తరగతి చదివే చంద్రిక అనాథలయ్యారు. భార్యభర్తల నడుమ గొడవలతో ఇప్పటికే తండ్రి ప్రేమను కోల్పోయిన చిన్నారులు చివరికి కన్నతల్లి కూడా ఈ లోకం విడిచి వెళ్లడంతో అనాఽథలుగా మిగిలిపోయారు.