వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 02:12 AM
80వ స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు...
అంబరాన్నంటిన స్వాతంత్య్రదిన సంబరాలు
తిరుపతి(కలెక్టరేట్), ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి):80వ స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు... పోలీసు దళాల కవాతు... వివిధశాఖల ప్రగతిని ప్రతిబింబిస్తూ సాగిన శకటాలు.. పోలీసు జాగిలాల విన్యాసాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.వివిధ శాఖలు, రంగాల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు, అధికారులకు, ఇతరులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. రైల్వేకోడూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు రాఘవరాజు రామలింగరాజు కుమారుడు రాధాకృష్ణమరాజును ఘనంగా సన్మానించారు.ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి వివిధ శాఖల తరపున ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలందజేశారు. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, జాయింట్ కలెక్టర్ గోవిందరావు ,డీఆర్వో నరసింహులు, నగరపాలక ఇన్‌ఛార్జి కమిషనర్ శారదాదేవి, ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరిస్తూ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.ఏపీఐఐసీ,పాఠశాల విద్యాశాఖ,ఎస్పీడీసీఎల్ శకటాలు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నాయి. తుడా శకటానికి కన్సొలేషన్ బహుమతి దక్కింది.విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 165మందికి ప్రశంసాపత్రాలందజేశారు.డీఆర్డీఏ సెర్ఫ్ ద్వారా 10,351మందికి రూ.1030కోట్ల రుణాలకు సంబంధించి మెగా చెక్కును అందజేశారు. మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీ కింద 1,298ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాలకు రూ.150కోట్లచెక్కును అందజేశారు. పెళ్లకూరుమండలం లలితమ్మ ట్రస్టు తరపున రుయాస్పత్రికి రూ.35లక్షలు విలువైన వైద్యపరికరాలను అందేశారు.పోలీసు జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.