Share News

అక్కా చెల్లెళ్ల విషాదాంతం

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:53 AM

గొర్రెలను మేపడానికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన వైనమిది. యామిగానిపల్లె పంచాయతీ సరిగప్పకొటాలు గ్రామంలో ఆదివారం ఈ విషాద జరిగింది.

అక్కా చెల్లెళ్ల విషాదాంతం
కుమార్తెల మృతదేహాల వద్ద రోదిస్తున్న తల్లి భూలక్ష్మి

గుడుపల్లె, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): గొర్రెలను మేపడానికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన వైనమిది. యామిగానిపల్లె పంచాయతీ సరిగప్పకొటాలు గ్రామంలో ఆదివారం ఈ విషాద జరిగింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన మునివెంకటప్ప, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో శ్రావణి(15) యామిగానిపల్లె ఉన్నత పాఠశాలలో 9వ తరగతి.. పునిత(18) కుప్పం ఎంఎ్‌ఫసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి గొర్రెల కాపరి. ఆదివారం తన వెంట ఇద్దరు కుమార్తెలను తీసుకొని గుట్టలకు వెళ్లారు. మధ్యాహ్నం గొర్రెలను సమీపంలోని శెట్టి చెరువుకు తీసుకెళ్లి నీరు తాగించారు. గొర్రెలను చెరువులో కడగమని తన కుమార్తెలకు చెప్పారు. ఈక్రమంలో గొర్రెలను కడుగుతుండగా ప్రమాదవశాత్తూ శ్రావణి కాలుజారి పడిపోతూ కేకలు వేసింది. అక్కడే ఉన్న పునిత చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో.. ఇద్దరూ పెద్ద గుంతలో పడి మునిగిపోయారు. మునివెంకటప్ప వెంటనే గుర్తించినా.. తనకు ఈత రాకపోవడంతో పరుగున వెళ్లి గ్రామస్థులకు చెప్పారు. వాళ్లు చేరుకునే సరికే అక్కాచెల్లెళ్లు నీట మునిగి చనిపోయారు. చెరువులో గాలించి ఇద్దరి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీశారు. కన్నబిడ్డలు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Updated Date - Mar 09 , 2026 | 01:53 AM