Share News

తిరుపతి మేయర్‌ స్థానం టీడీపీదే!

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:01 AM

తిరుపతి మేయర్‌ స్థానం విషయంలో అంచనాలు తారుమారయ్యాయి.చివరకు మేయర్‌ స్థానం టీడీపీకే ఖరారైంది. అలాగే వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట సహా మలి విడత ఎన్నికలు జరిగే శ్రీకాళహస్తి మున్సిపల్‌ ఛైర్మన్‌ సీట్లు సైతం ఆ పార్టీకే కేటాయించారు. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానం మాత్రం జనసేనకు ఖరారైంది.ఈ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేయనున్నారు.ఇందుకోసం రేసులో వున్న ముఖ్య ఆశావహుల పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం.

తిరుపతి మేయర్‌ స్థానం టీడీపీదే!

వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి కూడా

పుత్తూరు ఛైర్మన్‌ స్థానం జనసేనకు

తిరుపతి మేయర్‌ స్థానం విషయంలో అంచనాలు తారుమారయ్యాయి.చివరకు మేయర్‌ స్థానం టీడీపీకే ఖరారైంది. అలాగే వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట సహా మలి విడత ఎన్నికలు జరిగే శ్రీకాళహస్తి మున్సిపల్‌ ఛైర్మన్‌ సీట్లు సైతం ఆ పార్టీకే కేటాయించారు. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానం మాత్రం జనసేనకు ఖరారైంది.ఈ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేయనున్నారు.ఇందుకోసం రేసులో వున్న ముఖ్య ఆశావహుల పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం.

తిరుపతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):తిరుపతి మేయర్‌ స్థానం కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారనే విషయంలో అందరి అంచనాలూ తారుమారయ్యాయి.టీడీపీలో మేయర్‌ సీటు కోసం ఆశావహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ఆరంభించారు.ఓ దశలో ఒకరిద్దరు టికెట్‌ తమకేనంటూ బిల్డప్‌ ఇస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారమైంది. తర్వాతి దశలో బీజేపీ ఆశావహులు బలమైన ఎంట్రీ ఇచ్చారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి అయితే ఢిల్లీ స్థాయి నుంచీ ఒత్తిడి పెట్టించారు. ఒక దశలో బీజేపీకే మేయర్‌ సీటు కేటాయిస్తున్నారనే ప్రచారం జరిగింది. చివరి దశలో జనసేన రంగప్రవేశం చేసింది. ఎడిఫై విద్యా సంస్థల అధినేత పెనుమాడు ప్రణీత్‌ జనసేనలో చేరడంతో దాదాపు అతడికే టికెట్‌ కేటాయిస్తారన్న అభిప్రాయం కూటమి పార్టీల వర్గాలలో వ్యక్తమైంది. అయితే చివరికి గురువారం రాత్రి కూటమి పార్టీలు తిరుపతి మేయర్‌ సీటును టీడీపీకి వదిలిపెట్టాయి.దీంతో ఆ పార్టీలో ఆశావహులు టికెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమె మనవరాలు కీర్తి, పార్టీ ముఖ్య నేతలు మబ్బు దేవనారాయణరెడ్డి, నరసింహ యాదవ్‌, దంపూరి భాస్కర్‌ యాదవ్‌, పుష్పావతి యాదవ్‌, అన్నా అనిత, ఆర్సీ మునికృష్ణ, కోడూరు బాలసుబ్రమణ్యం తదితరుల పేర్లు టికెట్‌ రేసులో వినిపిస్తున్నాయి. యాదవ సామాజికవర్గానికి చెంది నెల్లూరులో ఇంజనీరింగ్‌ కళాశాల నడుపుతున్న డాక్టర్‌ గుణశేఖర్‌ రాయల్‌ పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ సస్పెన్స్‌ కూడా నేటి సాయంత్రానికల్లా తొలగిపోనుంది.

పుత్తూరు మినహా అన్ని స్థానాలూ టీడీపీకే

పుత్తూరు మినహా వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి తదితర నాలుగు మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలూ టీడీపీకే కేటాయించారు. వెంకటగిరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ టీడీపీ నుంచీ మున్సిపల్‌మాజీ ఛైర్‌పర్సన్‌ దొంతు శారద రేసులో వున్నారు. ఆమె పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వారు. అదే సామాజికవర్గానికి చెందిన సామల లక్ష్మిదేవి కూడా రేసులో వున్నారు. ఆమె భర్త చలపతి పట్టణంలో పేరుమోసిన చీరల వ్యాపారి. ఆర్థికంగా బలమైన కుటుంబం.వీరిద్దరితోపాటు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియ పేరు కూడా ప్రచారంలో వుంది. ఈ ముగ్గురి నడుమే టికెట్‌ కోసం పోటీ వుంది. నాయుడుపేట విషయానికొస్తే ఇక్కడ కూడా ఛైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వయింది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ శిరసనంబేటి విజయభాస్కర రెడ్డి కోడలు పూజ, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ 786 రఫీ సతీమణి షేక్‌ షకీరా నడుమ టికెట్‌ కోసం తీవ్ర పోటీ వుంది. సూళ్ళూరుపేట మున్సిసల్‌ ఛైర్‌పర్సన్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ టికెట్‌ కోసం పిట్ల సుహాసిని, నూలేటి విజయలక్ష్మి, గెరిక ఈశ్వరమ్మ పేర్లు ప్రచారంలో వున్నాయి. పిట్ల సుహాసిని మామ వెంకటసుబ్బయ్య సూళ్ళూరుపేటకు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. భర్త సుబ్రమణ్యం మాజీ ఎంపీపీ. ఆమెకే టికెట్‌ లభించే అవకాశం కనిపిస్తోంది. నూలేటి విజయలక్ష్మి గతంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈశ్వరమ్మ గతంలో ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి 16 వేల ఓట్లు సాధించారు. ఆమె టికెట్‌ ఇవ్వకుంటే వైసీపీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఇక్కడ అభ్యర్థి కొరత వున్నందున ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. శ్రీకాళహస్తిలో ఎన్నికలు ఈ విడతలో లేనందున అభ్యర్థి గురించి ఇప్పటికి ఎలాంటి చర్చా లేదు.

ఆశ్చర్యకరంగా మారిన పుత్తూరు పరిణామాలు

పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానం కూటమిలో జనసేనకు కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి నగరి నియోజకవర్గంలో ప్రత్యేకించి పుత్తూరు పట్టణంలో జనసేనకు చెప్పుకోదగ్గ బలమేమీ లేదు. నియోజకవర్గ ఇంఛార్జి మెరుపుల మహేశ్‌ పుత్తూరు పట్టణానికి చెందిన వారు. ఇక్కడ ఛైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. ఆ వర్గం నుంచీ పార్టీలో చెప్పుకోదగిన ఆశావహులు లేరు. దీంతో ఎవరికి టికెట్‌ ఇస్తారన్నది అంతుబట్టడం లేదు. ఈ కారణంగా జనసేన తరపున అభ్యర్థి ఎవరన్న దానిపై పట్టణంలో తీవ్ర ఉత్కంఠ వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 16 , 2026 | 02:01 AM