పట్టాభిషేకానికి వేళాయె!
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:48 AM
ల్లాలోని మదనపల్లె, పుంగనూరు, రాయచోటి మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. మూడు మున్సిపాలిటీలలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్ అభ్యర్థులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నేడు మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణస్వీకారం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఇంకా తేలని వైస్ చైర్మన్లు
అన్నమయ్య, నవంబర్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, రాయచోటి మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. మూడు మున్సిపాలిటీలలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్ అభ్యర్థులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు జుఎన్నికయ్యారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేస్తారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ 48 వార్డులు ఉండగా టీడీపీ 22, జనసేన 6, బీజేపీ 4, వైసీపీ 12, బీసీవై 1, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా బోనమల ఖాదర్‌వలి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారు. 44 వార్డులు ఉండగా 40 టీడీపీ, 3 బీజేపీ, ఒక స్థానాన్ని జనసేన ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్‌గా నయీంతాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ మేరకు పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ 36 వార్డులు ఉండగా జనసేన 1, ఎస్‌డీపీవో 1, సీపీఐ 1, 33 టీడీపీ గెలుచుకున్నాయి.
ప్రిసైడింగ్ అధికారుల నియామకం
మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణస్వీకారానికి కలెక్టర్ ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మదనపల్లె మున్సిపాలిటీకి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిని నియమించారు. రాయచోటికి పుంగనూరు ఏవో నారాయణరెడ్డిని నియమించారు. పుంగనూరుకు హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ మాధవకృష్ణారెడ్డిని నియమించారు. వీరు పాలకవర్గాల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.
వైస్ చైర్మన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ
కూటమి సీట్ల సర్డుబాటులో భాగంగా పుంగనూరు, రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మర్లు టీడీపీకి, మదనపల్లె బీజేపీకి కేటాయించారు. పాలకవర్గాల ప్రమాణస్వీకారానికి సమయం ఆసన్నమైనా వైస్ చైర్మన్లు ఎవరనేది ఇంకా తేలలేదు. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మదనపల్లె మున్సిపాలిటీలో ఈ పదవి కోసం జనసేన, బీజేపీ పోటీ పడ్డాయి. చైర్మన్ పదవి బీసీ సామాజికవర్గానికి ఇవ్వడంతో వైస్ చైర్మన్ కోసం కమ్మ, రెడ్డి, బలిజ సామాజికవర్గాలకు చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నా రు. ఈ రేసులో టీడీపీ నుంచి బోయపాటి రంగస్వామినాయుడు, బాబునాయుడు, నాగార్జున గాంధీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఎల్లంపల్లె ప్రశాంత్, విజయశ్రీ, జనసేన నుంచి లక్ష్మీదీపిక ప్రయత్నించారు. అయితే ఆదివారం రాత్రి ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయిం చారు. రాయచోటిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ బీసీ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వైస్ చైర్మన్ కూడా వారికే దక్కవచ్చనే ప్రచారం ఉంది. బోయ సామాజిక వర్గం నుంచి నల్లబోతుల రూపారాణి, యాదవ సామాజిక వర్గం నుంచి పదిలం లక్ష్మి, జానం రాధ, బలిజ సామాజిక వర్గం నుంచి కొట్టే చలపతి, సుగవాసి విద్యాదర్, తొగట సామాజికవర్గం నుంచి చెంగా రమాదేవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా, నల్లబోతుల రూపారాణి, పదిలం లక్ష్మి, రంజిత్ రాయల్ పేర్లతో ఐవీఆర్‌ఎస్ కాల్స్ వచ్చాయి. పుంగనూరులో బీసీ సామాజిక వర్గానికి చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. వైస్ చైర్మన్‌గా ఎవరికి అవకాశమిస్తారో అంతుపట్టడం లేదు. పేరు ఎక్కడా బయటకు రావడంలేదు. ఆశావహులుగా దేశాధి ప్రకాష్, ద్రాక్షాయిని, నాగరత్మమ్మ పేర్లు వినిపిస్తున్నాయి.