పులిగుండు తిరునాళ్లకు పోటెత్తారు
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:17 AM
సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్ద శనివారం తిరునాళ్ల నిర్వహించారు.
పెనుమూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్ద శనివారం తిరునాళ్ల నిర్వహించారు. ఈ తిరునాళ్లకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అనూహ్యంగా పెరగడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. రోడ్లపై వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంటల తరబడి వాహనదారులు, పాదచారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎప్పుడూ వన్ వే పెట్టేవారు.. ఈ ఏడాది ఎందుకు పెట్టలేదు అని వచ్చినవారు చర్చించుకున్నారు. ఉదయం శేష వాహనంపై పార్వతీపరమేశ్వరులు గిరిప్రదక్షిణగా కొత్తరోడ్డు, సీఎస్ అగ్రహారం మీదుగా కొండ చుట్టు నిర్వహించి, పులిగుండు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెనుమూరు శివాలయంలోని ఆది దంపతులను కూడా పులిగుండు వద్దకు ఆహ్వానించి భక్తులను అనుగ్రహించారు.