పల్లెకూ పాకిన బీపీ, షుగర్, క్యాన్సర్ల ముప్పు
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:09 AM
గ్రామాల్లో 1.03 లక్షల బీపీ, షుగర్ అనుమానిత కేసులు మారుతున్న ఆహారపు అలవాట్లు.. తగ్గుతున్న శారీరక శ్రమతో పెరుగుతున్న బాధితులు
తెల్లవారుజామునే నిద్రలేవడం. పొలం పనులు, నడక, శారీరక శ్రమ. ఇంట్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం.
- ఇదీ ఒకప్పటి ఆరోగ్యకరమైన పల్లె జీవనం
తగ్గిన శారీరక శ్రమ. మారిన ఆహారపు అలవాట్లు. పెరిగిన పొగాకు, మద్యపానం, అధిక ఉప్పు, నూనె, చక్కెర వినియోగం. జంక్ ఫుడ్.
- గ్రామాల్లో ఇప్పటి జీవనశైలి ఇదీ.
ఫలితం.. ఒకప్పుడు పట్టణ జీవనశైలితో ముడిపడి ఉన్నాయని భావించిన అధిక బీపీ, షుగర్, వివిధ రకాల క్యాన్సర్ల ముప్పు పల్లెకూ పాకాయి. వైద్య ఆరోగ్యశాఖ అసంక్రమిత వ్యాధుల(ఎన్‌సీడీ 4.0) స్ర్కీనింగ్‌లో వెల్లడైన గణాంకాలే దీనికి నిదర్శనం.
చిత్తూరు రూరల్, ఆంధ్రజ్యోతి: జిల్లాలోని 60 ఆరోగ్య కేంద్రాల పరిధిలో హైపర్‌టెన్షన్, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు సంబంధించి మొత్తం 1,03,127 అనుమానిత కేసులను గుర్తించారు. వీరిలో 1,01,545 మందికి పరీక్షలు పూర్తికాగా, మరో 1582 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీకి నమోదైన గణాంకాల ప్రకారం.. షుగర్ 39,359, బీపీ 37,875 కేసులు గుర్తించారు. నోటి క్యాన్సర్ 13,880, రొమ్ము క్యాన్సర్ 4,281, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 7,732 అనుమానిత కేసులను గుర్తించారు. వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం పెరగడం.. రోజువారీ పనుల్లో శారీరక శ్రమ తగ్గడం.. నడక బదులు ద్విచక్ర వాహనాలపై ఆధారపడటం దీనికో కారణం. మరోవైపు చిరుతిళ్లు, ప్యాకెట్ ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులు, అధిక చక్కెర కలిగిన పానీయాలు, నూనెలో వేయించిన పదార్థాలను తినడమూ కారణమే. పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలున్న ఆహారం తగ్గుతోంది. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంతో ఊబకాయం, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పొగాకు వినియోగం, మద్యపానం కూడా అనారోగ్య ముప్పును పెంచుతున్నాయి. ఇవన్నీ ఒక్కరోజులో వ్యాధులకు కారణం కాకపోయినా, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
బీపీ.. బయటపడితేనే తెలిసే ముప్పు
చాలామందిలో స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే బీపీ పెరుగుతుంది. తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలను.. సాధారణ సమస్యలుగా భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రమంగా రక్తనాళాలు, గుండె, మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. నియంత్రణలో లేని బీపీ గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలకు దారితీయొచ్చు. అందుకే లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా రక్తపోటును పరీక్షించుకోవాలి.
షుగర్.. అలవాట్లతో అదుపు తప్పుతోంది
మధుమేహం కూడా ప్రారంభ దశలో చాలామందికి తెలియదు. తరచూ దాహం వేయడం, మూత్ర విసర్జన ఎక్కువ కావడం, ఆకలి పెరగడం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే లక్షణాలు లేకుండానూ షుగర్ ఉండే అవకాశముంది. అధిక బరువు, కుటుంబంలో మధుమేహ చరిత్ర, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు షుగర్‌ను పెంచుతాయి. షుగర్ నిర్ధారణ అయ్యాక మందులు వాడుతూ ఆహార నియంత్రణ, వ్యాయామం పాటించకపోతే కంటి చూపు, మూత్రపిండాలు, నరాలు, గుండెపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
పొగాకు.. క్యాన్సర్‌కు ప్రధాన కారకం
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పొగాకు నమలడం, గుట్కా, ఖైనీ, జర్దా, బీడీ, సిగరెట్ వినియోగం ఆందోళన కలిగించే అంశాలే. నోటి క్యాన్సర్‌కు పొగాకు వినియోగం ప్రధాన కారకం. నోటిలో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, మానని పుండ్లు, నోరు తెరవడంలో ఇబ్బంది, మింగేటప్పుడు నొప్పి వంటి మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. పొగాకు వినియోగం లేకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, దాని వినియోగం ముప్పును గణనీయంగా పెంచుతుంది. రొమ్ములో గడ్డలు, ఆకృతిలో మార్పులు, చనుమొన నుంచి అసాధారణ స్రావాలు కనిపించే మహిళలు వైద్యులను సంప్రదించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) సంక్రమణ ఒకటి. అసాధారణ రక్తస్రావం, సంభోగం తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదు. వీటిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశముంది.
చిన్న మార్పులు చేసుకుంటే..
బీపీ, షుగర్, క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవాలంటే.. ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యమివ్వాలి. అధిక నూనెతో తయారుచేసిన పదార్థాలు, ప్యాకెట్ చిరుతిళ్లు, తీపి పానీయాలను పరిమితం చేయాలి. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. మద్యపానానికి స్వస్తి పలకాలి. రోజుకు కనీసం 30 నిమిషాల చొప్పున వారానికి ఐదు రోజులు నడక లేదా ఇతర శారీరక వ్యాయామాలు చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం. రోజువారీ అలవాట్లలో ఇలాంటి మార్పులు చేసుకుంటే సరి.
30 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి
అసంక్రమిత వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించేందుకు 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ స్ర్కీనింగ్ నిర్వహిస్తున్నాం. మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల ద్వారా వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అనుమానిత కేసులను వైద్యుల వద్దకు పంపించి తదుపరి పరీక్షలు చేయించడం, వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించడం ఈ కార్యక్రమంలో కీలకాంశం. 30 ఏళ్లు దాటినవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పల్లెల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని మళ్లీ అలవాటు చేసుకుంటేనే బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల ముప్పును తగ్గించగలం.
- నాగశశిభూషణ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో