గజరాజుల బీభత్సం
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:59 AM
పులిచెర్ల మండలంలో శుక్రవారం రాత్రి పంటలపై 14 ఏనుగుల గుంపు పడి బీభత్సం సృష్టించాయి. మామిడిచెట్ల కొమ్మలను విరిచేసి, కాయలను నేలరాల్చాయి. కొబ్బరిచెట్లను కూకటివేళ్లతో పెకలించాయి.
మామిడి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేసిన 14 ఏనుగులు
నేలరాలిన టన్నులకొద్దీ మామిడికాయలు
బోదబండ వద్ద మాటువేసిన ఏనుగుల గుంపు
కల్లూరు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో శుక్రవారం రాత్రి పంటలపై 14 ఏనుగుల గుంపు పడి బీభత్సం సృష్టించాయి. మామిడిచెట్ల కొమ్మలను విరిచేసి, కాయలను నేలరాల్చాయి. కొబ్బరిచెట్లను కూకటివేళ్లతో పెకలించాయి. డ్రిప్ పైపులు, గేటువాల్వ్‌లను ధ్వంసం చేశాయి. మండలంలోకి మళ్లీ ప్రవేశించిన ఏనుగుల గుంపు పంటలపై దాడులు చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముందుగా పశ్చిమ అటవీ విభాగం ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరిన 14 ఏనుగుల గుంపు పాతపాళ్యం అడవి మార్గంలో పాతపేట వరకు వెళ్లి తిరిగి కల్లూరు - గంటావారిపల్లె రోడ్డు వద్దకు చేరుకున్నాయి. తలారివారిపల్లెకి చెందిన మల్లికార్జున్ పొలంపై పడి మామిడిచెట్ల కొమ్మలను విరిచేశాయి. కొబ్బరిచెట్లను పెకలించాయి. డ్రిప్ పైపులు, గేటువాల్వ్‌లను విరిచేశాయి. అక్కడినుంచి బీసీ కాలనీలోని లక్ష్మీనారాయణ, శేషాద్రి పొలంలోకి చేరుకుని మామిడిచెట్లను ధ్వంసం చేశాయి. కల్లూరులోని టీఎస్ ఖాదర్‌బాషా మామిడిచెట్లను విరిచేశాయి. టన్నుల కొద్దీ మామిడి కాయలను నేలరాల్చాయి. అక్కడి నుంచి కర్నూలు-చిత్తూరు హైవే సమీపానికి చేరుకున్నాయి. ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో హైవేను దాటుకొని పాళెం పంచాయతీలోకి చేరుకున్నాయి. కోటపల్లెలోని కళావతి, దామోదర్, కృష్ణయ్య, భాస్కర్‌నాయుడు, నరేష్, వెంకట్రామయ్యకు చెందిన మామిడిచెట్ల కొమ్మలను ఏనుగుల గుంపు విరిచేశాయి. కాయలను నేల రాల్చాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతం సరిహద్దులో సోలార్ విద్యుత్ కంచె ఉండటంతో గమనించిన ఏనుగుల గుంపు సైదుల్లా గుట్ట సమీపంలో అడవిలోకి దాటుకున్నాయి. తూర్పు విభాగం అటవీ సరిహద్దులో ధ్వంసమైన పంటలను శనివారం ఉదయం రేంజర్ థామస్ సుకుమార్, ఎఫ్‌ఎ్‌సవో మహ్మద్ షఫి, ఎఫ్‌బీవో గోవిందయ్య పరిశీలించారు. సైదుల్లా గుట్ట సమీపంలోని అడవిలోకి చేరుకున్న ఏనుగులను డ్రోన్ కెమెరా సాయంతో గుర్తించారు. సోలార్ విద్యుత్ కంచె సమీపంలో ఏనుగుల గుంపు మాటు వేయడంతో అక్కడికి చేరుకున్న ట్రాకర్స్ టపాకాయలు పేల్చారు. దీంతో హైవే రోడ్డుకు సమీపంలోని బోదబండ వద్దకు ఏనుగుల గుంపు చేరుకున్నాయి. మండలంలోకి 14 ఏనుగుల గుంపు రావడంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేంజర్ థామస్ సుకుమార్ హెచ్చరించారు.