Share News

టెన్త్‌ స్పాట్‌ సెట్‌ చేశారు..!

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:50 AM

ఎట్టకేలకు బుధవారానికి టెన్త్‌ స్పాట్‌ను అధికారులు సెట్‌ చేశారు. తొలి రెండు రోజులు చోటు చేసుకున్న పరిణామాలను చిత్తూరు జిల్లా పరిశీలకుడు, సమగ్రశిక్ష ఇన్‌ఫ్రా జేడీ మువ్వా రామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్‌ కలిసి సర్దుబాటు చేశారు.

టెన్త్‌  స్పాట్‌ సెట్‌ చేశారు..!
డీఈవోకు వినతిపత్రం ఇస్తున్న ఫ్యాప్టో నాయకులు

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు బుధవారానికి టెన్త్‌ స్పాట్‌ను అధికారులు సెట్‌ చేశారు. తొలి రెండు రోజులు చోటు చేసుకున్న పరిణామాలను జిల్లా పరిశీలకుడు, సమగ్రశిక్ష ఇన్‌ఫ్రా జేడీ మువ్వా రామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్‌ కలిసి సర్దుబాటు చేశారు. ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ స్పాట్‌లో సిబ్బంది కొరత రాకుండా తగు చర్యలు చేపట్టారు. స్పాట్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. తొలి రెండు రోజులు ఒక్కో టీచర్‌కు కేవలం 20 పేపర్లు మాత్రమే ఇచ్చారు. మూడో రోజు నుంచి నిబంధనల ప్రకారం 40 పేపర్లు అందించారు. ట్యాబ్‌లతో పాటు నెట్‌వర్క్‌లోని సమస్యలు పరిష్కరించడంతో మార్కుల నమోదు ప్రక్రియ కాస్త వేగమైంది. అయినా, సెంట్రల్‌ సర్వర్‌లో సమస్య కారణంగా కొంత జాప్యం నెలకొంది. ఈ సమస్యను సైతం అధిగ మించడానికి జిల్లా పరిశీలకులు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులతో సమన్వయం చేసి, సమస్యను పరిష్కరించారు. బయట నుంచి ఇతర వ్యక్తులను లోపలకు అనుమతించకపోవడంతో పాటు సెల్‌ఫోన్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఇదిలా ఉండగా ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చడంతో బుధవారం స్పాట్‌లోని టీచర్లు ఉక్కపోతకు గురయ్యారు. మరోవైపు టీచర్లకు చల్లటి నీరు అందుబాటులో లేకపోవడంతో క్యాంటిన్‌ను ఆశ్రయిస్తున్నారు.

మూల్యాంకనంలో ఇబ్బందులు పరిష్కరించండి

పదో తరగతి మూల్యాంకనంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాఫ్టో నాయకులు బుధవారం స్పాట్‌ కేంద్రంలో డీఈవో రాజేంద్రప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. గతేడాది సోషల్‌ పరీక్షకు సంబంధించి బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా 09టి పరీక్ష పేపర్లను 01టి బోధించే టీచర్ల ద్వారా మూల్యాంకనం చేయించడాన్ని సవరించాలన్నారు. ట్యాబ్‌ ఆధారిట మార్కుల నమోదులో స్పెషల్‌ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న.. నెట్‌వర్క్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఒక రోజుకు 40 పేపర్లు మించి ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహించాలన్నారు. వినతి ప్రతం సమర్పించిన వారిలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిగండన్‌, మునీర్‌, నాయకులు నరోత్తంరెడ్డి, జీవీ రమ, మధన్‌మోహన్‌, చిట్టిబాబు, రహమత్‌, అరుణ్‌కుమార్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 01:50 AM