జూలై 14నాటికి భూగర్భజలాల పెంపే లక్ష్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:47 AM
భూగర్భజలాల పెంపే లక్ష్యంగా ‘జలధార’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోమవారం మొదలైన ఈ కార్యక్రమం జూలై 14వ తేది వరకు జరగనుంది. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ‘నీరు- చెట్టు’ పేరుతో చెరువుల్ని పునరుద్ధరించి నీటి సంరక్షణ పనులను చేపట్టింది.
చిత్తూరు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలాల పెంపే లక్ష్యంగా ‘జలధార’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోమవారం మొదలైన ఈ కార్యక్రమం జూలై 14వ తేది వరకు జరగనుంది. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ‘నీరు- చెట్టు’ పేరుతో చెరువుల్ని పునరుద్ధరించి నీటి సంరక్షణ పనులను చేపట్టింది. ఆ తర్వాత వైసీపీ హయాం ఐదేళ్ల పాటు జలవనరుల శాఖ నిస్తేజంగా మారిపోయింది. ఇప్పుడు ‘నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత’ నినాదంతో జలధారకు శ్రీకారం చుట్టింది. నీటి వినియోగదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో 3106 చెరువుల ద్వారా 88,872 ఎకరాలకు, కార్వేటినగరంలోని కృష్ణాపురం రిజర్వాయర్ ద్వారా 6125 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జిల్లాలో మొత్తం 219 సాగునీటి సంఘాలతో పాటు ఓ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పనిచేస్తున్నారు.
నాలుగు దశల్లో..
చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం నాలుగు దశల్లో జరుగుతుంది. ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు పనుల్ని గుర్తిస్తారు. 16నుంచి 20వ తేదీలోగా అనుమతులు మంజూరు చేస్తారు. ఏప్రిల్ 21 నుంచి జూలై 7 వరకు పనుల్ని అమలు చేస్తారు. నివేదికలు, డాక్యుమెంట్స్ సబ్మిట్ జూలై 7- 14 తేదీల మధ్యలో జరుగుతుంది.
ఏయే పనులు చేస్తారంటే..
చిన్నపాటి చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు.. చెరువులకు నీళ్లొచ్చే కాలువల్ని శుభ్రం చేయడం.. చెరువు కట్టల్ని బలోపేతం చేయడం.. చెరువల్ని కాలువలతో/ పైభాగపు నీటి వనరులతో అనుసంధానం చేయడం.. వర్షపు నీటిని చెరువుల్లోకి మళ్లించే చర్యలు.. పచ్చదనం పెంపు కార్యక్రమం.. కొత్తగా నీటి సంరక్షణా నిర్మాణాలు చేపట్టడం.. ప్రతి గ్రామానికీ నీటి భద్రత ప్రణాళిక- నీటి బడ్జెట్ సిద్ధం చేయడం.. వంటి పనుల్ని చేపట్టనున్నారు.
జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలు..
జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవో, గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన కమిటీల్ని ఏర్పాటు చేస్తారు. ఆయా స్థాయిల్లోని భూగర్భజల శాఖ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు కమిటీలో ఉంటారు. గ్రామ స్థాయిలో పనుల్ని గుర్తించి అమలు చేస్తారు.
ఇదీ లక్ష్యం
భూగర్భజల మట్టాన్ని 3-6 మీటర్ల మధ్యకు తీసుకురావడం. 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యం. కనీసం ఒక మీటరు వరకు భూగర్భజల స్థాయి పెరిగేలా చర్యలు చేపట్టాలి. ఏప్రిల్ 10లోగా మండలాల వారీగా భూగర్భజల నివేదిక అందించి.. ప్రతి 15 రోజులకోసారి ప్రగతి నివేదికలు సమర్పించాలి.